ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ‌త‌ కొంత కాలంగా రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల సినిమాలకు దూరంగా ఉన్నారు. 2018లో అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్‌ రాజకీయ రంగప్రవేశంతో ఏ సినిమాలోనూ నటించలేదు. అయితే మ‌ళ్లీ ఈయ‌న సిల్వ‌ర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే వేణు శ్రీరామ్‌ డైరెక్షన్లో ఓ సినిమా ప‌ట్టాలెక్కించాడు ప‌వ‌న్‌. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అక్కడ అమితాబ్ బచ్చన్ చేసిన లాయర్ పాత్రను ఇక్కడ పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి వెంకటేశ్వర ప్రొడక్షన్ హౌస్‌లో బెనర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ చాలా ఫాస్ట్‌గా జరిగిపోతోంది. 

 

దీంతో ఈ సినిమాను అనౌన్స్ చేసిన నాలుగు నెలల్లోనే రిలీజ్ చేసేయాలని నిర్ణయించేసుకున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఇక ఈ చిత్రానికి  ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రంలో నివేదా థామస్‌, అనన్య ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోందని తెలుస్తోంది. పవన్‌కల్యాణ్‌ 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న టైమ్‌లో చిత్ర సంగీత దర్శకుడు థమన్‌.. ఫస్ట్ సింగిల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించాడు. 

 

అయితే తాజాగా చిత్ర యూనిట్ దీన్ని కన్ఫామ్ చేస్తూ.. మార్చి 2 సాయత్రం 5 గంటలకు పవన్‌ ఫస్ట్‌లుక్‌‌ను విడుదల చేస్తామ‌ని తెలిపింది. ఈ క్ర‌మంలోనే ముందుగా ఓ ప్రీ లుక్‌ను విడుద‌ల చేసింది. మ‌రోవైపు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న ఫస్ట్‌సాంగ్‌ను విడుదల చేయనున్నారని సమాచారం. కాగా, ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని మే 15న సమ్మర్ కానుకగా రిలీజ్ చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: