ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్ టీజర్‌ వివాదం తీసుకొచ్చింది. ఆదివాసీలను కించపరిచేలా ఎన్టీఆర్ గెటప్‌ ఉందంటూ.. ఆందోళన చేశారు. ఎంపీ జోక్యం చేసుకొని.. రాజమౌళికి వార్నింగ్‌ ఇచ్చేవరకు వివాదం వెళ్లింది. దీనిపై జక్కన్నగానీ.. ఆర్‌ఆర్‌ఆర్‌ టీం కూడా ఇంతవరకు స్పందించలేదు. ఈ వివాదానికి ఇప్పట్లో తెరపడే అవకాశం ఉందా? రాజమౌళి ఎందుకు రెస్పాన్స్‌ ఇవ్వడం లేదనే ప్రశ్న సినీ అభిమానుల్లో కలుగుతోంది.

కొమరం భీం.. అల్లూరి సీతారామరాజు కలిస్తే.. ఎలా ఉంటుదన్న కల్పిత కథతో ఆర్‌ఆర్‌ఆర్‌ రూపొందుతోంది. ఎన్టీఆర్‌  కొమరం భీమ్‌గా.. రామ్‌చరణ్‌  మన్నెం వీరుడిగా నటిస్తున్నారు. ఫిక్షన్‌ స్టోరీనే అయినా..  అల్లూరి... కొమరం వంటి పోరాట యోధులను ఎలా పడితే అలా చూపిండానికి వీల్లేదు. కొమరం భీమ్‌ ముస్లిం వేషధారణలో నిజాం పాలకులపై పోరాటం చేశారన్న కథలు చరిత్రలో ఉన్నాయి. ఈక్రమంలో రామ్‌చరణ్‌ ఫర్‌ కొమరం టీజర్‌లో ఎన్టీఆర్‌ను ముస్లింగెటప్‌లో చూపించగా.. ఇప్పుడిదే వివాదంగా మారింది.

కొమరం భీమ్‌ను ముస్లిం వేషధారణలో చూపించడం ఆదివాసులకు నచ్చలేదు. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు దీనిపై స్పందిస్తూ ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీమ్ చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదని రాజమౌళిని హెచ్చరించారు. టోపీ ధరించి ఉన్న సన్నివేశాలని తొలగించాలని.. లేకపోతే సినిమా థియేటర్లపై దాడి చేస్తామన్నారు. దీనిపై రాజమౌళి కానీ ఆర్.ఆర్.ఆర్ బృందం కానీ ఇంతవరకు స్పందించలేదు. ఈ వివాదాన్ని పట్టించుకోకుండా.. ముందు సినిమా షూటింగ్‌ పూర్తి పనిచేసే పనిలో బిజీగా ఉన్నాడు రాజమౌళి.

అల్లూరి, కొమరం భీమ్‌ కలిసినట్లు చరిత్రలో లేదు. ఫిక్షన్‌ కథ కాబట్టి.. కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్తే.. ఒకరినొకరు తారసపడితే ఎలా ఉండేదన్న ఊహాజనిత కథను విజయేంద్రప్రసాద్ సృష్టించారు. చరిత్రలో నిలిచిపోయిన ఇద్దరు ప్రముఖుల జీవితాలను తెరకెక్కిస్తున్న క్రమంలో వివాదాలు వస్తాయని ముందే సిద్దపడే ఈ కథను ఎంచుకున్నాడు రాజమౌళి. సినిమా రిలీజ్‌కు ఇంకా చాలాకాలం ఉంది. ఇప్పుడే సమాధానమిస్తే.. మళ్లీ కౌంటర్‌ ఇస్తారని.. ఇప్పటి నుంచే రచ్చ ఎందుకని ఆర్‌ఆర్‌ఆర్‌ టీం భావిస్తోంది. చిన్న టీజరే వివాదం సృష్టిస్తే.. ఇక ట్రైలర్ ఇంకెన్ని కాంట్రవర్సీలు తీసుకొస్తుందోగానీ.. రిలీజ్‌ టైంలో జక్కన్న చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: