
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కోరలు చాస్తోంది. ఇప్పటికే భారీ ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆక్సిజన్ కొరతతో పాటు వ్యాక్సిన్ కొరత కూడా భారత్ లో తీవ్రంగా ఉంది. హాస్పిటల్ కి వెళ్లి అక్కడ బెడ్స్ దొరకక బయటే చనిపోతున్న పరిస్థితి నెలకొని ఉంది. తాజాగా ఒక యంగ్ హీరోయిన్ ఇంట్లో కూడా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెలుగులో రంగం, దళం, నిన్ను కలిశాక లాంటి సినిమాలతో పరిచయం అయిన పియా బాజపేయి సోదరుడు కరోనా కారణంగా బెడ్ దొరకక మరణించారు.
ఈ విషయాన్ని హీరోయిన్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. ముందుగా ఆమె ఉత్తరప్రదేశ్లోని ఫరుకాబాద్ జిల్లాలోని ఖయాం గంజ్ బ్లాక్లో వెంటిలేటర్ తో కూడిన బెడ్ కావాలని ట్విట్టర్ వేదికగా కోరారు. తన సోదరుడు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాడని ఏమైనా సహాయం చేయాలని అభ్యర్థించారు. ఏమైనా తెలిస్తే ఒక నెంబర్ కి ఫోన్ చేయండి అంటూ అభిషేక్ అనే వ్యక్తి ఫోన్ నెంబర్ కూడా ఆమె షేర్ చేశారు.
ఇప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్నామని అర్థం చేసుకోవాలని ఆమె కోరారు. సరిగ్గా మరో రెండు గంటల్లో తన సోదరుడు చనిపోయాడు అంటూ ఆమె ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఇక కరోనా కేసుల పెరుగుదలతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. సకాలంలో ఆక్సిజన్ లభించక కోవిడ్ రోగులు చనిపోతున్నారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆక్సిజన్ కొరత మాత్రం తీరడం లేదు. దీంతో కొంత మంది దాతలు తమకు తోచిన సహాయం చేస్తున్నారు.