
అల్లు అర్జున్, వంశీ పైడిపల్లి కలిసి ఒక సినిమా చేయబోతున్నారనే వార్త గత కొంత కాలంగా సినీ వర్గాల్లో హల్చల్ చేస్తుంది. కానీ మొన్నటి వరకూ బన్నీ గానీ వంశీ గాని తమ కాంబో ప్రాజెక్టుపై అంతగా శ్రద్ధ పెట్టలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వంశీ, బన్నీ ఫోన్ కాల్స్ ద్వారా స్టోరీ గురించి బాగా చర్చిస్తున్నారట. కరోనా బారిన పడ్డ అల్లు అర్జున్ స్వల్ప లక్షణాలతో ఇంట్లోనే ఒక రూమ్ లో ఒంటరిగా కాలం గడుపుతున్నారు.
అయితే ఆయనకు ఖాళీ సమయం దొరకడంతో వంశీ కి ఫోన్ చేసి కథ విన్నారని.. స్క్రిప్ట్ విషయంలో సుదీర్ఘమైన చర్చలు జరుపుతున్నారని సమాచారం అందుతోంది. ఈ చర్చల్లో వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చితే ఆయనతో సినిమా చేయడానికి బన్నీ ఓకే చెప్పే అవకాశం ఉంది. ఐతే వంశీ ప్రస్తుతం తాను రాసుకున్న కథను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. ఒకవేళ అల్లు అర్జున్ తో చేసే సినిమా హిట్టయితే.. వంశీ కెరీర్ మళ్ళీ గాడిలో పడుతుంది.
ఇకపోతే మహర్షి సినిమా చేసిన తర్వాత వంశీ పైడిపల్లి మహేష్ తో కలిసి మరొక సినిమా ప్లాన్ చేశారు. కానీ మహేష్ బాబు కి కథ నచ్చకపోవడంతో ఆయన వంశీ తో సినిమా చేసేందుకు ఒప్పుకోలేదు. దీంతో వంశీ పైడిపల్లి మరి కొంతమంది హీరోల వద్దకు వెళ్లి తాను రాసుకున్న కథ వినిపించారు కానీ ఎవరూ కూడా అతనితో కలిసి సినిమా తీసేందుకు ఒప్పుకోలేదు.
ఐతే రెండు సంవత్సరాలకు పైగా ఖాళీగా ఉన్న వంశీ పైడిపల్లి ఇటీవల కోలీవుడ్ హీరో విజయ్ కి ఒక స్టోరీ వినిపించగా.. దళపతి విజయ్ అతనితో సినిమా చేసేందుకు అంగీకరించారట. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించేందుకు ముందుకు వచ్చారని కూడా ప్రచారం జరుగుతోంది. బన్నీ, విజయ్ ఇద్దరు కూడా తమ సినిమాలతో ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. దీంతో వచ్చే ఏడాదిలో వంశీ తన సినిమాల షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.