కంగనా రనౌత్ అకౌంట్ ని ట్విట్టర్ బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ట్విట్టర్ పై తీవ్ర విమర్శలు చేసి, ఆమె ప్రత్యామ్నాయ సోషల్ మీడియా విభాగాలను వాడుకుంటోంది. అయితే తాజాగా మరోసారి ట్విట్టర్ లో కంగన వైరల్ గా మారింది. కంగన వదిలేసినా, ట్విట్టర్ మాత్రం ఆమెను వదిలేలా లేదు.

అసలేం జరిగింది..?
వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కంగనా రనౌత్, తాజాగా గంగా నదిలో కొట్టుకొస్తున్న శవాలపై స్పందించింది. ఇటీవల గంగ, యమున నదుల్లో కొవిడ్ రోగుల మృతదేహాలను విచ్చలవిడిగా పడేస్తున్నారని, తీర ప్రాంతాలకు కొట్టుకొస్తున్న ఈ శవాలను చూసి స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారని వార్తలొచ్చాయి. ఆ నీటి ద్వారా కరోనా వ్యాపించే ప్రమాదం ఉందేమోననే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. దీంతో కొన్నిగ్రామాల ప్రజలు హడలిపోయారు. ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఇదో సంచలనంగా మారింది. అధికారులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే కంగనా రనౌత్ మాత్రం తాను ఈ విషయాలను నమ్మనంటోంది. ఇన్‌స్టా వేదిక‌గా దీనిపై స్పందించిన కంగన.. ఇదంతా గంగాన‌దిలో జ‌రిగింది కాద‌ని తెలిపింది.  సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు, వీడియోలు నైజీరియా దేశానివని చెప్పుకొచ్చింది. దీంతో కంగనపై ట్రోలింగ్ మొదలైంది. అది కూడా ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారడం విశేషం. కంగన ట్విట్టర్ లో లేకపోయినా ఆమెపై ట్రోలింగ్ మాత్రం ఆగలేదు.


 

కంగ‌నా వ్యాఖ్య‌ల్ని చాలామంది ఖండిస్తూ ట్వీట్లు వేస్తున్నారు. ఎమోజీలు, కార్టూన్లు పోస్ట్ చేస్తున్నారు. నైజీరియా ఉత్తర ప్రదేశ్‌ లో ఉందా అంటూ ట్రోలింగ్‌ మొదలు పెట్టారు. దీంతో మరోసారి కంగన ట్విట్టర్ లో ట్రెండింగ్ సబ్జెక్ట్ ల్లో చేరిపోయారు. మరోవైపు ఇటీవలే కంగన కొవిడ్ నుంచి కోలుకుంది. వైద్యుల పర్యవేక్షణలో ఆమె చికిత్స తీసుకుని కొవిడ్ ని జయించింది. దీనికి సంబంధించి అభిమానులకు కొవిడ్ రక్షణ కోసం పలు సూచనలు సలహాలు కూడా ఇచ్చింది కంగన.

 

మరింత సమాచారం తెలుసుకోండి: