త్వరలోనే జరగనున్న ప్రతిష్టాత్మకమైన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా టాలెంటెడ్ యాక్టర్ ప్రకాశ్‌రాజ్‌ పోటీ చేయనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రకాశ్‌రాజ్‌ తాను "మా" ఎలక్షన్స్ లో అధ్యక్షుడిగా పోటీ చేయనున్నారని వెల్లడించారు. దీంతో ఈ ఇంటర్వ్యూలో మా ఎలక్షన్స్ కి సంబంధించి ప్రకాశ్‌రాజ్‌ కి అనేక ప్రశ్నలు సంధించారు. మీకు ప్రత్యర్థిగా ఎవరు బరిలోకి దిగనున్నారు? పోటీగా నిలబడుతున్న మీకు ఎవరి సపోర్టు ఉండనుంది? వంటి ప్రశ్నలు అడిగారు. చిరంజీవి మీకు సపోర్ట్ చేస్తారని టాక్. దీనిపై మీరేమంటారు? అని ప్రశ్నించారు. దీంతో ప్రకాష్ రాజు ఈ ప్రశ్నలన్నిటికీ తనదైన శైలిలో సమాధానాలిచ్చారు.


చిరు మద్దతు విషయంపై మాట్లాడుతూ.. చిరంజీవి అందరి వ్యక్తి కాబట్టి ఆయన వ్యక్తిగతంగా ఎవరికీ మద్దతు ఇవ్వరు. ఎవరు మంచి చేస్తారని ఆయన భావిస్తారో వారికే సపోర్ట్ చేస్తారు. తనతో నాకున్న సాన్నిహిత్యాన్ని నేను ఎలక్షన్ల కోసం ఉపయోగించుకొను అని ఆయన చెప్పుకొచ్చారు.



ఇక మా అసోసియేషన్ కి అధ్యక్షుడు అయ్యేందుకు తనకు అన్ని అర్హతలూ ఉన్నాయన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. మా అసోసియేషన్ ప్రతిష్ట పెంచేందుకు తన వంతు కృషి చేస్తానని.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యలు గురించి తనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉందని.. వాటిని పరిష్కరించేందుకు తన దగ్గర తగిన ప్రణాళికలు ఉన్నాయని ఆయన అన్నారు. ఇతర పరిశ్రమలతో పోలిస్తే తెలుగు చలనచిత్ర పరిశ్రమ చాలా పెద్దదని.. కానీ ఒకప్పుడు ఉన్న పేరు ప్రఖ్యాతలు లేవని.. తాను అధ్యక్షుడైతే భారత దేశ వ్యాప్తంగా "మా" కి అత్యున్నత గౌరవం తెస్తానని ఆయన అన్నారు.



మా అసోసియేషన్ కి ఇప్పటివరకు సొంత భవనం లేదని.. తాను అధ్యక్షుడిగా ఎన్నికైన మరుక్షణమే భవన నిర్మాణం ప్రారంభిస్తానని.. 100% భవనం నిర్మిస్తానని ఆయన అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ కార్మికులకు సహాయం చేసే గొప్ప మనసున్న నటీ నటులు ఎందరో ఉన్నారని వారిని ఏకతాటిపైకి తెచ్చేందుకు తాను కృషి చేస్తానని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: