
జూన్ 28, 1921న కరీంనగర్ జిల్లాలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జన్మించారు. అయితే ఈ రోజు ఆయన శత జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఐతే ఈ సందర్భంగా ఆయన జీవితచరిత్ర ఆధారంగా ఒక బయోపిక్ రూపొందించనున్నామని నిర్మాత తాడివాక రమేష్ నాయుడు ప్రకటించారు. తెలంగాణ ముద్దుబిడ్డ, ఏకైక తెలుగు ప్రధానమంత్రి అయిన పీవీ నరసింహారావు బయోపిక్ ని భారీ బడ్జెట్ తో రూపొందించేందుకు రమేష్ నాయుడు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఈ బయోపిక్ ని ధవళ సత్యం అనే ఒక ప్రసిద్ధ సీనియర్ దర్శకుడు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు. ధవళ సత్యం "యువతరం కదిలింది" వంటి విప్లవాత్మక సినిమాలు రూపొందించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
'ఎన్టీఆర్ ఫిల్మ్స్' పతాకంపై నిర్మించనున్న పీవీ బయోపిక్ ని తెలుగు, హిందీ భాషలతో పాటు మిగతా ముఖ్య భాషల్లో కూడా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అయితే పీవీ నరసింహారావు పాత్రలో ఒక నేషనల్ స్టార్ నటించనున్నారని సమాచారం. నేషనల్ వైడ్ గా బాగా పాపులారిటీ ఉన్న యాక్టర్ నటిస్తేనే సినిమా అందరికీ రీచ్ అయ్యే అవకాశం ఉందని చిత్ర బృందం సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని.. త్వరలోనే సెట్స్ పైకి రానుందని సమాచారం. అయితే ఈ చిత్రాన్ని పీవీ నరసింహారావు యొక్క 101వ జయంతి సందర్భంగా అనగా 2022, జూన్ 28న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
అపర చాణక్యుడు, బహు భాషాకోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పీవీ నరసింహారావు జీవిత ప్రయాణం అసాధారణమైనది కాగా ఆయన జీవిత చరిత్రపై ఓ బయోపిక్ చేస్తున్నామని తాడివాక రమేష్ నాయుడు ప్రకటించడం నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే గతంలో రమేష్ నాయుడు శ్రీహరి హీరోగా నటించిన "శ్రీశైలం" సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు.