సూర్య 24 ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాడు. ఈ లాంగ్ కెరీర్‌లో 'గజిని'లాంటి చాలెంజింగ్‌ రోల్స్‌ ప్లే చేశాడు. అయితే ఈ మూవీస్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ విజయాన్ని అందుకున్నా, ఆ రికార్డులు కొన్నాళ్ల వరకు గుర్తున్నాయి. అయితే 'జై భీమ్' సినిమా మాత్రం చర్చలకి వేదికగా మారింది. సూర్య నేటి సమాజానికి అవసరమైన కథని తీసుకున్నాడని కొందరు అంటే, ఇలాంటి సినిమాని తెలుగులో ఊహించగలమా అని మరికొంతమంది కాంప్లిమెంట్స్‌ ఇచ్చారు.

మద్రాస్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రు న్యాయవాదిగా ఉన్నప్పుడు వాదించిన రాజకన్ను కేసు నేపథ్యంలో తెరకెక్కింది 'జై భీమ్'. అట్టఅడుగు వర్గాల ప్రజలకి ఇంకా న్యాయం దక్కడం లేదనే పాయింట్‌ని బలంగా వినిపించాడు సూర్య. ఎనభైల్లో జరిగిన సంఘటనలు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. అందుకే హక్కుల కార్యకర్తలతో పాటు, రాజకీయ నాయకులు కూడా ఈ సినిమాని మెచ్చుకుంటున్నారు.

నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమా 'శ్యామ్‌సింగరాయ్'. పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో నాని మార్క్జిస్ట్‌గా నటించాడు. ఆడవాళ్లని బలవంతంగా దేవదాసీలుగా మార్చే సాంఘీక దురాచారంపై పోరాటం చేశాడు. రీసెంట్‌గా రిలీజైన టీజర్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజలని చైతన్యవంతం చెయ్యడంలో సినిమాని మించిన సాధనం మరొకటి లేదని చాలామంది చెప్తారు. కానీ సినిమాకి కూడా లెక్కలుంటాయి. పెట్టుబడి, రాబడిల్లో తేడాలొస్తే నిర్మాతలు నష్టపోతారు. అందుకే ఫార్ములా సినిమాలు ఎక్కువయ్యాయనే విమర్శలున్నాయి. దశాబ్ధాలుగా ఇండస్ట్రీలో పాతుకుపోయిన ఈ లెక్కల నుంచి స్టార్లు ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నారు.

జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ఎక్కువగా మాస్‌ మూవీసే చేశారు. మాస్‌ స్టార్స్‌గా బాక్సాఫీస్‌ దగ్గర భారీ వసూళ్లు అందుకున్నారు. అయితే ఇప్పుడు 'ట్రిపుల్‌ ఆర్'తో ఉద్యమకారులుగా మారిపోయారు. మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ పాత్రలు పోషించారు. 'ట్రిపుల్ ఆర్'లో జూ.ఎన్టీఆర్ కొమరం భీమ్‌ పాత్ర పోషించాడు. ఇక రామ్‌ చరణ్‌, అల్లూరి సీతారామ రాజుగా నటించాడు. అలాగే 'ఆచార్య' సినిమాలోనూ రగల్‌ జెండా ఎత్తాడు రామ్‌ చరణ్. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చరణ్‌ నక్సలైట్‌గా నటించాడు. ఇక చిరు కూడా మావోయిస్ట్‌గా నటించాడు. రెగ్యులర్‌ సినిమాటిక్‌ రోల్స్‌ చేసే రానా కూడా అడవిలో అన్నగా మారిపోయాడు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌తో 'విరాటపర్వం' చేశాడు రానా.  వేణు ఉడుగుల దర్శకత్వంలో నైంటీస్‌ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతుందీ సినిమా. ఈ మూవీలో రానా వైద్యవృత్తిని వదిలిపెట్టి, అన్యాయాన్ని ఎదిరించే కామ్రేడ్‌ రవన్నగా నటించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: