యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న, చేయబోతున్న సినిమాల లైనప్ ఓ రేంజ్‌లో ఉంది. 'బాహుబలి' తర్వాత నుంచి పాన్ ఇండియా ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ…
సలార్', 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ కె', 'స్పిరిట్' చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు మరో సినిమాను ప్రభాస్ ఓకే చేశారు. మారుతి దర్శకత్వంలో పని చేయడానికి రెడీ అవుతున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. 'రాజా డీలక్స్' అనే పేరుని సినిమా టైటిల్ గా అనుకుంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను తీసుకోవాలనుకుంటున్నారట. ఇప్పటికే దర్శకనిర్మాతలు సంజయ్ దత్ తో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సంజయ్ ను విలన్ రోల్ కోసం సంప్రదిస్తున్నారా..? లేక మరేదైనా పాత్రా..? అనే విషయంలో క్లారిటీ లేదు.

ఈ మధ్యకాలంలో సంజయ్ దత్ కి విలన్ గా ఆఫర్స్ బాగా ఎక్కువయ్యాయి. 'కేజీఎఫ్2' సినిమాలో కూడా ఆయన విలన్ గా కనిపించారు. రీసెంట్ గా దళపతి విజయ్ సినిమాలో ఆయన్ను విలన్ గా తీసుకున్నట్లు సమాచారం. దానికి రూ.10 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారట. మరి ప్రభాస్ సినిమాలో నటించడానికి ఈ నటుడు ఎంత డిమాండ్ చేస్తారో చూడాలి..!

ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతుందని టాక్. కొత్త యంగ్ రెబల్ స్టార్‌ను ఈ సినిమాలో చూడొచ్చట. మూడు నాలుగు నెలల్లో షూటింగ్ అంతా పూర్తి చేసేలా ప్లాన్ చేశారట. భారీ సెట్స్ అవసరం లేకుండా సినిమాను చిన్నగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ప్రభాస్, అతని సన్నిహితులతో మారుతికి మంచి స్నేహం ఉంది. మారుతి దర్శకత్వ శైలి గురించి ప్రభాస్‌కు తెలుసు.

మారుతి మంచి కథ తీసుకు రావడంతో ప్రభాస్ ఓకే చేశారట. హారర్ కామెడీ బ్యాక్ గ్రౌండ్ లో సాగే కథ అని తెలుస్తోంది. ఆల్రెడీ 'ప్రేమ కథా చిత్రమ్' వంటి హారర్ కామెడీ తీసి హిట్ కొట్టిన అనుభవం మారుతికి ఉంది. దీంతో ప్రభాస్ తో ఎలాంటి కథ తీయబోతున్నారనే ఆసక్తి నెలకొంది. ఈ సినిమా కోసం ప్రభాస్ భారీ పారితోషికం అందుకోనున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

కొన్ని రోజుల క్రితం ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు మారుతి. తన మార్క్ లోనే సినిమా చేస్తానని అన్నారు. దీనికొక ఉదాహరణ కూడా చెప్పారు. 'మనం నాటుకోడి బాగా వండుతామని తెలిసి మనల్ని పిలిచినప్పుడు మనకి వచ్చిన వంటే చేసి పెట్టాలి తప్ప మనకి రాని చైనీస్ మరొకటి వండకూడదు' అంటూ చెప్పుకొచ్చారు. కథ ప్రకారం.. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. మెయిన్ హీరోయిన్ గా అనుష్కను తీసుకున్నట్లు సమాచారం. ఆమె ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. అదే నిజమైతే మరోసారి తెరపై ప్రభాస్-అనుష్కలను చూసే ఛాన్స్ వస్తుంది. రెండు, మూడు షెడ్యూల్స్ లో సినిమాను పూర్తి చేస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: