భాగ్య శ్రీ బోర్సే.. ఈ అమ్మ‌డు చేసింది చాలా త‌క్కువ సినిమాలు. పైగా అందులో ఒక్క హిట్ కూడా లేదు. కానీ టాప్ హీరోయిన్ల‌నే వెన‌క్కి నెడుతూ అవ‌కాశాలు అందుకోవ‌డంలో య‌మా దూకుడు చూపిస్తోంది. మహారాష్ట్రలో పుట్టిన భాగ్య శ్రీ బోర్సే.. కాలేజీ రోజుల్లోనే మోడ‌లింగ్ లోకి ప్ర‌వేశించింది. పలు బ్రాండ్లకు ప్ర‌చార‌క‌ర్త‌గా వ్యవహరించింది. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ యాడ్ తో పాపుల‌ర్ కావ‌డంతో భాగ్య‌ శ్రీ‌కి సినిమాలు అవ‌కాశాలు త‌లుపుత‌ట్టాయి.


భాగ్య‌ శ్రీ బోర్సే తొలి చిత్రం `యారియాన్ 2`. ఈ బాలీవుడ్ మూవీ 2023లో విడుద‌లైంది. ఇందులో మెయిన్ హీరోయిన్ కాన‌ప్ప‌టికీ.. రాజలక్ష్మి అనే పాత్ర‌ను భాగ్య‌ శ్రీ పోషించింది. ఆ త‌ర్వాత `చందు ఛాంపియన్‌` అనే మ‌రో హిందీ చిత్రంలో మెరిసిన భాగ్య‌ శ్రీ‌.. `మిస్టర్ బచ్చన్` మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. హ‌రీష్ శంక‌ర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ర‌వితేజ హీరోగా న‌టించారు. సినిమా డిజాస్ట‌ర్ అయిన కూడా భాగ్య శ్రీ త‌న‌దైన అందం, అభిన‌యంతో యువ‌త హృద‌యాల‌ను గెలుచుకుంది. టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారింది.



కెరీర్ లో ఇంత‌వ‌ర‌కు ఒక్క హిట్ లేకున్నా ప్ర‌స్తుతం భాగ్య శ్రీ చేతినిండా సినిమాలే ఉన్నాయి. త్వ‌ర‌లోనే ఈ వ‌య్యారి `కింగ్‌డమ్` మూవీతో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, భాగ్య శ్రీ జంట‌గా న‌టించారు. జూన్ 4న కింగ్‌డ‌మ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధ‌మ‌వుతోంది.



అలాగే టాలీవుడ్ ఉస్తాద్ రామ్ పోతినేనితో భాగ్య శ్రీ బోర్సే ఓ మూవీ క‌మిట్ అయింది. ప్ర‌ముఖ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ‌హేష్‌.పి ద‌ర్శ‌కుడు. `ఆంధ్రా కింగ్‌ తాలుకా` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఇక రీసెంట్‌ సెన్సేషన్‌ భాగ్య శ్రీ టేక‌ప్ చేసిన మ‌రో ప్రాజెక్ట్ `కాంత‌`. దుల్కర్‌ సల్మాన్‌, రానా నటిస్తున్న మల్టీస్టారర్ ఇది. ఈ మూవీలోనూ హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని భాగ్య శ్రీ‌ చేజిక్కించుకుంది. మొత్తానికి నిన్న మొన్నటి వరకు సైలెంట్‌గా క‌నిపించిన భాగ్య శ్రీ‌.. ఇప్పుడు ఇండ‌స్ట్రీనే రూల్ చేస్తోంది. మ‌రి ఇక ముందు ఈమె కెరీర్ ఎలా సాగ‌నుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: