సిల్క్ స్మిత.. ఈ నిషా కళ్ళ సుందరి గురించి పరిచయం అక్కర్లేదు. తన అందచందాలతో ఒక తరాన్ని ఉర్రూతలూగించిన ఈ తార.. మేకప్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత అవకాశాలు రావడంతో వెండితెరపై అడుగు పెట్టింది. హీరోయిన్ గా కాకుండా గ్లామర్ రోల్స్ తో స్టార్ అయ్యింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 450 కి పైగా చిత్రాల్లో నటించింది. ఒకానొక దశలో సిల్క్ స్మిత పాట లేనిదే ఏ హీరో సినిమాకు శుభం కార్డు పడేది కాదు. అంతటి క్రేజ్ ను సొంతం చేసుకుందామె.


చిన్న వయసులోనే పేరు, డబ్బు, హోదా అన్ని సంపాదించుకుంది. కానీ వాటిని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయింది. ప్రేమించిన వాడు మోసం చేయడం, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం, సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో 35 ఏళ్లకే సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని విడిచింది. వెండి తెర‌పై శృంగార తారగా గుర్తింపు పొంది ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిన సిల్క్ స్మిత.. వ్యక్తిగతంగా మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. నటిగా రాణిస్తున్న సమయంలోనే నిర్మాతగా మారి చేతులు కూడా కాల్చుకుంది.


ఎస్సార్ సినీ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సిల్క్ స్మిత.. మొత్తం మూడు సినిమాలను నిర్మించ‌గా అందులో ఒక్కటి మాత్రమే విడుదల కావడం గ‌మ‌నార్హం. ఇంతకీ ఆ ఒక్క చిత్రం మరేదో కాదు `ప్రేమించి చూడు`. త్రివురనేని వరప్రసాద్ దర్శకత్వం వ‌హించిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్, సిల్క్ స్మిత ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు, రాజ్-కోటి సంగీతం అందించారు. 1989లో విడుదలైన ప్రేమించు చూడ దారుణంగా ఫ్లాప్ అవ్వ‌డంతో సిల్క్ స్మిత త‌న న‌గ‌లు తాక‌ట్టు పెట్టి మ‌రీ అప్పులు క‌ట్టింది.


ఆ తర్వాత స్వీయ నిర్మాణంలో `నా పేరు దుర్గ` అనే మ‌రో సినిమాను సిల్క్ నిర్మించింది. త్రిపురనేని మహారథి ఈ మూవీకి డైరెక్టర్. చాలా వరకు షూటింగ్ పూర్తయినప్పటికీ ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. ఇక తమిళ ఫైట్ మాస్టర్ క్రాస్ బెల్ట్ మణి ద‌ర్శ‌కుడిగా `వీరవిహారం` అని యాక్షన్ మూవీని సిల్క్ స్మిత పట్టాలెక్కించింది. అయితే ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. నటిగా, ఐటమ్ డాన్సర్ గా సూపర్ సక్సెస్ ను చూసిన సిల్క్ స్మిత.. నిర్మాతగా మాత్రం సత్తా చాటలేకపోయింది. ప్రొడక్షన్ రంగంలోకి దిగి కోరి కష్టాలను, ఆర్థిక ఇబ్బందులను తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: