
డిఫరెంట్ మేకవర్‌లో విలక్షణ నటన ప్రదర్శించి ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించుకున్నారు ఫహాద్. షెకావత్ పాత్రకు తాను తప్ప మరెవరు సెట్టవ్వరు అనే రేంజ్ లో పర్ఫార్మ్ చేశారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. పుష్ప చిత్రంలో షెకావత్ క్యారెక్టర్ గా ఫస్ట్ ఛాయిస్ ఫహాద్ ఫాజిల్ కాదు. మొదట ఈ పాత్రకు ఓ టాలీవుడ్ హీరోను అనుకున్నారట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు నారా రోహిత్.
`భైరవం` మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నారా రోహిత్.. ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టాడు. పుష్పలో నెగటివ్ షేడ్స్ ఉన్న భన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు ముందుగా తననే సంప్రదించారని ఆయన స్పష్టం చేశాడు. `పుష్ప టీమ్ కోవిడ్ టైంలో మీసాలతో ఉన్న నా ఫోటోని ఒకటి పంపారు. ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్ మరియు నిర్మాతలు షెకావత్ పాత్ర గురించి నాతో డిస్కస్ చేశారు. అయితే పుష్ప మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాక.. అన్ని భాషల నటీనటులు సినిమాలో ఉండాలనే ఉద్ధేశంతో ఆ పాత్రకు ఫహాద్ ను ఫైనల్ చేశారు` అంటూ నారా రోహిత్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం ఆలస్యంగా బయటకు రావడంతో.. సినీ ప్రియులు ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా పుష్పలో నారా రోహిత్ నటించి ఉండుంటే.. ఆయన కెరీర్ కు ఆ సినిమా టర్నింగ్ పాయింట్ అయ్యేది అనడంలో ఎటువంటి డౌట్ లేదు.