
ముఖ్యంగా కూలీ డీసెంట్ వసూళ్లు సాధించినా.. దాని భారీ బడ్జెట్‌తో పోల్చితే లాభాలు తక్కువే. అయితే, యానిమేషన్ మూవీ అయిన మహావతార్ నరసింహా మాత్రం బడా స్టార్ల సినిమాలను మట్టికరిపిస్తూ ఐదో వారంలోకీ అడుగుపెట్టింది. గత నాలుగు వారాల్లో ఎన్నో చిన్నా, పెద్దా సినిమాలు విడుదలైనా, వాటిలో ఒక్కటీ ఈ సినిమా కలెక్షన్లను ప్రభావితం చేయలేకపోయాయి. చాలా సినిమాలు థియేటర్లలో నిలవలేక పోయినా, మహావతార్ నరసింహా మాత్రం ఫుల్ ఆక్యుపెన్సీతో రాణిస్తోంది. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తుండటం వసూళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది.
భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమా గానూ ఇది రికార్డ్ సృష్టించింది. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది. హిందీలోనే రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించడం ఒక మైలురాయిగా నిలిచింది. తెలుగులోనూ అంచనాలను మించి వసూళ్లు రాబడుతూ, లాంగ్ రన్‌లో రాణిస్తోంది. ఇంకా ఈ సినిమా ఓటీటీ, టెలివిజన్ హక్కుల డీల్స్ ఫైనలైజ్ కాలేదు. అయితే, ఈ సినిమాకు లభిస్తున్న రెస్పాన్స్‌ను బట్టి చూస్తే, ఆ డీల్స్ కూడా భారీ స్థాయిలోనే ఉండబోతున్నాయి. థియేట్రికల్ రన్‌తోపాటు ఓటీటీ, శాటిలైట్ హక్కులు కలిపి నిర్మాతలకు పెద్ద లాభాలను తెచ్చిపెట్టడం ఖాయం.