అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచ సినిమా పరిశ్రమ మొత్తానికి పెద్ద షాక్ ఇచ్చింది. అమెరికా బయట షూట్ చేసిన సినిమాలకు 100 శాతం పన్ను విధించాలని ఆయన నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం “ట్రూత్ సోషల్”లో ప్రకటించారు. నేడో రేపో అధికారికంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ కూడా జారీ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు అమెరికాలో విడుదలయ్యే భారతీయ సినిమాలకు పరిమిత పన్ను మాత్రమే ఉండేది. కానీ 100 శాతం ట్యాక్స్ అమల్లోకి వస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఉదాహరణకు, ఒక టాలీవుడ్ సినిమాను అమెరికాలో మిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తే, అదే మొత్తం పన్నుగా కట్టాల్సి వస్తుంది. అంటే ఓవర్సీస్ మార్కెట్‌లో లాభాలు దాదాపు సగానికి పడిపోతాయి. దాంతో ప్రస్తుతానికి అమెరికా మార్కెట్‌పైనే ఆధారపడి బడ్జెట్ రికవరీ చేసుకునే టాలీవుడ్ సినిమాలకు ఇది పెద్ద దెబ్బ అవుతుంది.


కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్, కోలీవుడ్ సహా మొత్తం భారతీయ సినిమా పరిశ్రమ, అలాగే ఇతర దేశాల సినిమాలూ ఇదే ప్రాబ్ల‌మ్ త‌ప్ప‌దు. అమెరికన్ సినిమాలకూ ఇబ్బందులు తప్పవు. ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమాలు పెద్ద ఎత్తున ఇతర దేశాల్లో షూటింగ్ జరిపి, తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యత కలిగిన ప్రొడక్షన్ తో వ‌చ్చేవి. యూరప్, కెనడా, ఆస్ట్రేలియా, ఆసియా దేశాల్లో అనేక హాలీవుడ్ సినిమాలు చిత్రీకరించబడ్డాయి. కానీ ఇప్పుడు ట్రంప్ నిబంధనల వల్ల అమెరికా ప్రొడక్షన్ కంపెనీలు తమ సినిమాలను ఎక్కువగా అమెరికాలోనే షూట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది బడ్జెట్‌పై భారమవడమే కాక, గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు వేసే హాలీవుడ్‌కు కూడా సవాలుగా మారనుంది.


ఇక టాలీవుడ్ విషయానికి వస్తే, గత కొన్నేళ్లుగా అమెరికా ఓవర్సీస్ మార్కెట్‌గా బాగా పెరిగింది. కొన్ని సినిమాలు అమెరికాలో మాత్రమే సాధించిన కలెక్షన్లతో తమ ఖర్చులను రికవరీ చేసుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సినిమాలు అక్కడ మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరడం సాధారణమైపోయింది. అలాంటిది ఇప్పుడు ట్రంప్ నిర్ణయం వల్ల ఆ మార్కెట్ త‌గ్గితే అది స్టార్ హీరోల సినిమాల వసూళ్లు, ప్రి రిలీజ్ బిజినెస్‌పై ప్ర‌భావం చూపుతుంది.


అయితే, అమెరికా న్యాయనిపుణులు మాత్రం ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టారిఫ్‌లు సాధారణంగా వస్తువులపై మాత్రమే వర్తిస్తాయి, సినిమాలు, క్రియేటివ్ కంటెంట్ వంటి సర్వీసులపై వర్తించవని కొంతమంది న్యాయవాదులు వాదిస్తున్నారు. అందువల్ల ఈ నిర్ణయం కోర్టుల్లో నిలబడకపోవచ్చని భావిస్తున్నారు. అయినప్పటికీ, తాత్కాలికంగా అయినా ఈ టారిఫ్‌లు అమల్లోకి వస్తే, టాలీవుడ్ సహా గ్లోబల్ సినిమా పరిశ్రమ మొత్తం కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: