కే ర్యాంప్ సినిమా కలెక్షన్ల విషయంలో నైజాం, ఓవర్సీస్ ఏరియాల్లో మొదలైన చిన్న వివాదం పెద్ద దుమారంగా మారిందన్న విషయం విదితమే. ఒక గ్యాసిప్ వెబ్ సైట్ పై నిర్మాత రాజేష్ దండా తీవ్రంగా స్పందించడం, ఆయన తన ఆవేదనను, ఫ్రస్టేషన్ ను వెళ్లగక్కడం చర్చనీయాంశమైంది. తమ సినిమా కలెక్షన్లను కావాలనే తక్కువగా చూపుతున్నారని ఆ వెబ్ సైట్ పై రాజేష్ దండా ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక, సోషల్ మీడియా ద్వారా ఈ విషయమై వివరణ కూడా ఇవ్వడం జరిగింది.

వాస్తవానికి కే ర్యాంప్ చిత్రం నైజాం ప్రాంతంలో ఇప్పటికే లాభాల బాట పట్టింది. వెంకటరత్నం అనే బయ్యర్ నైజాం, వైజాగ్ ఏరియా హక్కులను దాదాపు రెండు కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. నైజాం ఏరియా నుంచే రెండు కోట్ల రూపాయల షేర్, ఉత్తరాంధ్ర (వైజాగ్) నుంచి సుమారు యాభై లక్షల షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఖర్చులు పోను మొత్తం రెండున్నర కోట్ల రూపాయల షేర్ వచ్చిందంటే అది మంచి మొత్తమనే చెప్పవచ్చు. కే ర్యాంప్ సినిమాను టార్గెట్ చేస్తూ నెగటివ్ ప్రచారం జరుగుతోందనే భావనతోనే నిర్మాత రాజేష్ దండా ఆ విధంగా స్పందించారు. ఈ ప్రచారం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమై ఉంటాయనేది ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతి సినిమాకు ఇటువంటి పరిణామాలు సాధారణమే అయినప్పటికీ, కే ర్యాంప్ విషయంలో వివాదం పెద్దది కావడం గమనార్హం.

కే ర్యాంప్' విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 17.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిందని, బ్రేక్ ఈవెన్ కూడా చేరుకుందని ప్రకటించారు. అయితే, ఆ వెబ్ సైట్ మాత్రం 'డ్యూడ్' వంటి ఇతర చిత్రాల కలెక్షన్లతో పోల్చుతూ తప్పుడు కథనాలు రాసిందని నిర్మాత మండిపడ్డారు. ఈ క్రమంలో, తమ కలెక్షన్లు సరైనవేనని నిరూపించడానికి, హీరో కిరణ్ అబ్బవరం తో కలిసి త్వరలో యూఎస్ థియేటర్స్ టూర్ కు వెళ్తున్నట్లు కూడా నిర్మాత ప్రకటించారు. చిన్న సినిమాల విషయంలో కొందరు అనుసరిస్తున్న పక్షపాత వైఖరిని నిరసిస్తూ, 'బాహుబలి' అయినా, 'కే ర్యాంప్' అయినా ఒకేలా చూడాలని ఆయన విమర్శకులను కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: