- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

తెలుగు తెరపై తన అందం, నటనతో కాసేపట్లోనే గుర్తింపు తెచ్చుకున్న నటి అను ఇమ్మాన్యుయేల్‌ ఇటీవల తన కెరీర్‌ గురించి ఓపెన్‌గా మాట్లాడి చర్చకు దారితీసింది. ‘ కిట్టూ ఉన్నాడు జాగ్రత్త ’ అనే చిన్న సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అను, ఆ సినిమా పెద్ద హిట్ కాకపోయినా ఒక్కసారిగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. పవన్ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌, నాని, నాగచైతన్య లాంటి అగ్రహీరోలతో కలిసి నటించడం ఆమె అదృష్టంగా చెప్పుకోవాలి. అయితే ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, కొన్నింటికి వసూళ్లు కూడా సగటుగా రావడంతో ఆమె కెరీర్ దిశ కొంత మారిపోయింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న అజ్ఞాత‌వాసి సినిమా చేసినా అది డిజాస్ట‌ర్ అయ్యింది.


మధ్యలో చేసిన కొన్ని కమర్షియల్ సినిమాలు కథ పరంగా బలహీనంగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఆమె ఇమేజ్‌పై ప్రభావం పడింది. తాజాగా విడుదలైన ‘ గర్ల్ ఫ్రెండ్ ’ సినిమాలో కీలకమైన పాత్ర పోషించి మళ్లీ మంచి పేరు తెచ్చుకుంది.  ఈ సినిమా ప్రమోషన్లలో తన కెరీర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. “ కెరీర్ ఆరంభంలోనే పెద్ద స్టార్స్‌తో నటించడం నాకు గర్వంగా ఉంది. కానీ కొన్ని చేయకూడని సినిమాలు చేశాను. అది పూర్తిగా నా తప్పే. కమర్షియల్ సినిమాల్లో నటించడం వల్ల నటిగా నాకు గుర్తింపు రాలేదు. ఇకపై అలాంటి ప్రాజెక్టులు చేయను ” అని అను స్పష్టం చేసింది.


సినీ రంగంలో మొదట్లో చాలా మంది నటీనటులు ఇలాంటి తప్పులు చేస్తారు. అవకాశాలు వచ్చినప్పుడు వాటి ప్రభావం గురించి ఆలోచించకపోవడం సహజం. అయితే వాటి నుంచి నేర్చుకొని ముందుకు సరిగ్గా సాగడం నిజమైన ఎదుగుదలకు సంకేతం. అను ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు అదే దిశగా ఆలోచిస్తోంది. మంచి కథలు, బలమైన పాత్రల వైపు దృష్టి పెట్టి తన నటనను నిరూపించుకోవాలన్న తపన స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మార్పు ఆమె కెరీర్‌కి పాజిటివ్ సైన్‌గా మారుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: