టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే టాపిక్... సూపర్‌స్టార్ మహేష్ బాబు మరియు గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి (జక్కన్న) కాంబినేషన్‌లో వస్తున్న సినిమా గురించే. ఈ భారీ ప్రాజెక్టుపై కేవలం తెలుగు ప్రేక్షకులలోనే కాదు, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి మైలురాళ్లను అందుకున్న జక్కన్న, మహేష్‌తో జతకట్టడం అంటే సినీ చరిత్రలో మరో దృశ్యకావ్యం ఆవిష్కారం కావడం ఖాయమని సినీ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన నిర్మాణ వ్యవహారాలు కూడా పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కే.ఎల్. నారాయణ ఒక నిర్మాతగా వ్యవహరిస్తుండగా, షోయింగ్ బిజినెస్ బ్యానర్ ద్వారా కార్తికేయ మరో నిర్మాతగా భాగమవుతున్నారు. కే.ఎల్. నారాయణ ఎంతో అనుభవం ఉన్న నిర్మాత కాగా, కార్తికేయ రాజమౌళికి అత్యంత సన్నిహితులు. అయితే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లు, భారీ లాభాలు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుండటంతోనే, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో కార్తికేయ కూడా నిర్మాతగా భాగమవుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

రాజమౌళి స్టైల్ ఆఫ్ మేకింగ్, మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ కలగలిస్తే థియేటర్లలో అద్భుతాలు జరుగుతాయని అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా, 'ఆర్ఆర్ఆర్' తర్వాత జక్కన్న తీస్తున్న ఈ సినిమా తప్పకుండా హాలీవుడ్ స్థాయి టెక్నికల్ వాల్యూస్‌తో, గ్రిప్పింగ్ కథనంతో ఉంటుందని నెటిజన్ల నుంచి బలంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రం భారతీయ సినిమా ఖ్యాతిని మరింత పెంచడమే కాకుండా, జక్కన్నకు హాలీవుడ్ లెవెల్‌లో గుర్తింపు, పేరు తీసుకురావడం ఖాయమని సినీ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద, ఈ సినిమా అప్‌డేట్స్ కోసం యావత్ సినీ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. సినిమా సినిమాకు  దర్శకధీరుడు రాజమౌళి రేంజ్ కూడా ఊహించని స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: