మంచు కురిసే రాష్ట్రంలో వేడి రాజుకుంది. నాలుగు రోజులుగా కాశ్మీర్​ లోయలో ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ఆందోళ‌న అక్క‌డి ప్ర‌జానికాన్ని క‌ల‌వ‌ర‌పెడుతోంది. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై అంతటా ఉత్కంఠ నెలకొంది. మోడీ సర్కార్​ ఏ నిర్ణయం తీసుకోబోతోందనే చర్చ తారాస్థాయికి చేరింది. జమ్ము కశ్మీర్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందన్న ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్రంలో తీవ్ర అలజడి, ఆందోళన నెలకొన్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం ఢిల్లీలో ఉన్నత భద్రతాధికారులతో సమావేశం కావడం, సోమవారం కేంద్ర మంత్రివర్గం భేటీ కానుండడం ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి. జమ్ము కశ్మీర్‌కు చెందిన అఖిలపక్ష నేతలు ఆదివారం నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా నివాసంలో సమావేశమయ్యారు. కశ్మీర్‌కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, 35ఏను రద్దు చేయడంతోపాటు రాష్ర్టాన్ని కేంద్ర ప్రభుత్వం మూడు ముక్కలు చేయవచ్చునన్న ప్రతిపాదనలకు వ్యతిరేకంగా పోరాడాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. రాష్ట్రంలో ఉద్రిక్తతలు పెంచే చర్యలకు దిగొద్దని భారత్, పాకిస్థాన్ ప్రభుత్వాలకు సూచించారు. 


స‌రిహద్దు రాష్ట్రంలో టెన్షన్​ను నివారించేలా కేంద్రం ఏదో ఒక ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న కేబినెట్​ భేటీ కీలకంగా మారింది. సాధారణంగా ప్రతి బుధవారం కేంద్ర సెక్రటేరియట్​ సౌత్​ బ్లాక్​లోనే  ప్రధాని మోడీ ​ కేబినెట్ మీటింగ్​ నిర్వహిస్తారు. అలాంటిది ఈసారి మాత్రం మీటింగ్​ను సోమవారానికి మార్చ‌డంతో పాటు వేదికను ప్రధాని అధికార నివాసమైన 7, లోక్​కల్యాణ్​ మార్గ్​కు మార్చారు. ఈ మీటింగ్​లో కాశ్మీర్​ అంశమే ప్రధాన అజెండాగా ఉండొచ్చని, కేబినెట్​ తీసుకోబోయే నిర్ణయాల్ని ఇదే రోజు పార్లమెంట్​లోనూ ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. జమ్మూకాశ్మీర్​కు స్పెషల్​ స్టేటస్​ కల్పించే 370 ఆర్టికల్​, నాన్​లోకల్స్​కు ఇబ్బందిగా మారిన 35ఏ ఆర్టికల్​ను ఎత్తేస్తారనే ఊహాగానాలతోపాటు పాక్​ ఆధీనంలో ఉన్న కాశ్మీర్​నూ స్వాధీనం చేసుకునే దిశగా నిర్ణయాలు వెలువడొచ్చని స్వత్రా చర్చ జరుగుతోంది.


అయితే, జమ్మూకాశ్మీర్ గవర్నర్​ మాత్రం వీటిని కొట్టిపారేశారు. ‘‘ఏం చేసినా అందరికీ చెప్పే చేస్తాం. సోమ, మంగళవారాల్లో దీనిపై ఓ క్లారిటీ వస్తుంది’’అని గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​ చెప్పారు. ఆగస్టు 15న శ్రీనగర్​లోని లాల్​ చౌక్​లో ప్రధాని మోడీ జెండా ఎగరేస్తారని, అందుకోసమే సెక్యూరిటీని పెంచారన్న వాదననూ కేంద్రం నిరాకరించింది. కాగా, ఇండిపెండెన్స్​ డే నాడు కాశ్మీర్​ లోయలోని అన్ని ప్రాంతాల్లో జాతీయ జెండా ఎగరేసేందుకే సెక్యూరిటీ పెంపు తదితర తతంగం జరుగుతున్నట్లు అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: