ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంక్షేమం తలెత్తబోతోందా.. బొగ్గు నిల్వలు నిండుకున్నాయా.. ఇక కరెంట్ కోతలు తప్పవా.. పట్టణాలు, గ్రామాల వారీగా వివిధ సమయాల్లో కరెంట్ కోత విధించాలని ఇప్పటికే ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చిందా.. త్వరలో దీన్ని అమలు చేయబోతోందా.. ఇవీ కొన్ని రోజులుగా మీడియాలో షికారు చేస్తున్న వార్తలు.. సజ్జల వంటి కీలక నాయకులు కూడా కరెంట్ కోతలు తప్పవు అని ప్రకటించేసరికి జనం బెంబేలెత్తిపోయారు.. మళ్లీ చీకటి కాలం రాబోతోందా అన్న ఆందోళనలు నెలకొన్నాయి.


అయితే.. ఈ భయం తొలగిపోయేలా.. ఇప్పుడు జగన్ సర్కారు ఓ ప్రకటన చేసింది. విద్యుత్‌ కోతలపై వదంతులు నమ్మొద్దంటోంది. ఈ మేరకు ఈపీడీసీఎల్‌ సీఎండీ సంతోష్‌రావు ప్రకటించారు.  విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును ప్రభుత్వం సరఫరా చేసిందని ఈపీడీసీఎల్‌ సీఎండీ సంతోష్‌రావు తెలిపారు. విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని ఈపీడీసీఎల్‌ సీఎండీ సంతోష్‌రావు క్లారిటీ ఇచ్చేశారు.


విద్యుత్‌ కోతలపై మీడియాలోనూ, సామాజిక మీడియాలోనూ తప్పుడు ప్రచారం వస్తోందని  ఇంధన శాఖ  అంటోంది. ఈ సమాచారంలో ఏమాత్రం నిజం లేదని ఇంధన శాఖ ఖండించింది. పట్టణాలు, గ్రామాల్లో గంటల తరబడి కోతలంటూ చేస్తోన్న దుష్ప్రచారాన్ని  ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. విద్యుత్‌ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఇప్పటికే అన్ని చర్యలు  తీసుకున్నామని చెబుతోంది.

ప్రజలకు నిరంతరంగా … నాణ్యమైన విద్యుత్‌  సరఫరాకు  డిస్కమ్‌లో ఇప్పటికే   చర్యలు తీసుకున్నాయని చెబుతోంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఇప్పటికే అధికారులను ఆదేశించారట. అంతే కాదు... బొగ్గు కొనుగోలు నిమిత్తం ఏపీ జెన్‌కోకు రూ.250 కోట్లు విడుదల చేశారట. అంతే కాకుండా  రాష్ట్రానికి అదనంగా రోజుకి దాదాపు 8 బొగ్గు రైళ్లు కేటాయించిన విషయాన్ని కూడా ప్రభుత్వం తెలిపింది. సింగరేణి సంస్థతో ఎప్పటికప్పుడు సంప్రదించి బొగ్గు సరఫరా  కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అలాగే కీలకమైన వీటీపీఎస్‌, కృష్ణపట్నంలోనూ  థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి పునరుద్ధరణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: