గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు క్రమంగా చిక్కుముడి వీడుతోంది. ఇప్పుడు హత్యలో కీలక పాత్ర పోషించాడని భావిస్తున్న దస్తగిరి వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. దస్తగిరి గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి వద్ద కారు డ్రైవర్‌గా పని చేశాడు. అందువల్ల ఆయన వాంగ్మూలం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంటోంది. వివేకా హత్య వెనుక వైఎస్‌ కుటుంబీకులు ఉన్నారని ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని దస్తగిరి చెప్పడాని వెలుగు చూసిన వాంగ్మూలం ఇప్పుడు జగన్‌ ను చిరాకు పెట్టేలా ఉంది.


గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్.. ఈ హత్యకు కారణం టీడీపీయేనని ఆరోపించారు. ఈ హత్యపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత వైసీపీ హయాంలో జగన్ సర్కారు వివేకా హత్య కేసు విచారణను సిట్‌కు అప్పగించారు. ఆ సిట్ దర్యాప్తు పెద్దగా పురోగమించలేదు. ఈ దశలో  వివేకా కుమార్తె పోరాటం కారణంగా సీబీఐ విచారణ మొదలైంది. ఇప్పుడు సీబీఐ ఈ కేసును లోతుగా విచారించింది. అందులో ఒక్కొక్కటిగా వివరాలు వెలుగు చూస్తున్నాయి.


ఇప్పుడు వివేకా హత్య వెనుక వైఎస్ కుటుంబీకులే ఉన్నారన్న దస్తగిరి వాంగ్మూలం సంచలనంగా మారుతోంది. వివేకాను చంపాలని ఎర్రగంగిరెడ్డి నాకు సూచించాడన్న దస్తగిరి.. అందుకు తాను మొదట్లో ఒప్పుకోలేదని చెప్పినట్టు వాంగ్మూలంలో ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే వివేకా హత్య వెనుక పెద్దల ప్రమేయం ఉందని.. ఈ హత్య వెనుక వైఎస్ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి ఉన్నారని ఎర్ర గంగిరెడ్డి తనకు చెప్పినట్టు దస్తగిరి వాంగ్మూలంలో ఉందని వార్తలు వస్తున్నాయి.


ఇప్పుడు ఈ వాంగ్మూలాన్ని టీడీపీ అస్త్రంగా మలచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంత కుటుంబంలో వచ్చిన గొడవలే వివేకా హత్యకు దారి తీశాయని.. కానీ జగన్ మాత్రం టీడీపీని టార్గెట్ చేశారని ఆ పార్టీ జనంలోకి వెళ్లే అవకాశం ఉంది. మరి దీనిపై జగన్ ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: