భార‌త దేశం తొలి సీడీఎస్ గా ఖ్యాతి పొందిన త్రివిధ ద‌ళాల స‌మ‌న్వ‌య‌క‌ర్త బిపిన్ రావ‌త్ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృత్యుఒడిలోకి వెళ్ల‌డం యావ‌త్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బిపిన్ రావ‌త్‌తో పాటు 13 మంది మ‌ర‌ణించారు. అయితే, గ‌తంలోనూ చాలా మంది ప్ర‌ముఖులు హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం చెందారు. గ‌తంలో జ‌రిగిన హెలికాప్ట‌ర్ ప్రమాదాల్లో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, జీఎసీ బాల‌యోగి, సినీన‌టి సౌంద‌ర్య, సంజ‌య్ గాంధీ, మాధ‌వ‌రావు సింథియా లాంటి చాలా మంది హెలికాప్ట‌ర్‌, విమాన ప్ర‌మాదాల్లో ప్రాణాలు విడిచారు.
 

  హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మ‌ర‌ణించారు. రెండో సారి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొద్ది నెల‌ల‌కే 2009 సెప్టెంబ‌ర్ 2న చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్తుండ‌గా వాతావ‌ర‌ణ కార‌ణాలు, ద‌ట్ట‌మైన మేఘాల్లో హెలికాప్ట‌ర్ చిక్కుకుపోవ‌డంతో ప్ర‌మాదం సంభ‌వించింది. వైఎస్సార్ ప్ర‌యాణిస్తున్న బెల్ 430 హెలికాప్ట‌ర్ న‌ల్ల‌మ‌ల అడ‌వుల్లో కూలిపోవ‌డంతో.. వైఎస్ రాజేశేఖ‌ర్ రెడ్డితో స‌హా మొత్తం ఐదుగురు మృత్యు భారిన ప‌డ్డారు. ఎన్డీయే ప్రభుత్వ హ‌యాంలో లోక్ సభకు స్పీకర్ గా బాధ్యతలు తెలుగు వ్య‌క్తి జీఎంసీ బాలయోగి కూడా హెలికాప్టర్ ప్ర‌మాదంలోనే ప్రాణాలు కోల్పోయారు. 2002 మార్చి 3వ తేదిన బాల‌యోగి ప్రయాణిస్తున్న బెల్‌ 206 హెలికాప్టర్‌ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్ర‌మాదానికి గురికావ‌డంతో ఆయ‌న మ‌ర‌ణించారు.


ప్రముఖ సినీనటి సౌందర్య కూడా  2004 ఏప్రిల్‌ 17న  హెలికాప్టర్ క్రాష్ లోనే మృతి చెందారు. అప్పుడే రాజ‌కీయాల్లోకి అడుగుపెడుతున్న క్ర‌మంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవ‌డంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తండ్రి మాదవ రావు సింధియా కూడా 2001 సెప్టెంబర్‌ 30న జ‌రిగిన‌ విమాన క్రాష్‌లోనే ప్రాణాలు విడిచారు.  కాన్పూర్‌లో జరిగిన ఈ ఘటనలో సింధియా సహా ఏడుగురు మృతి చెందారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎం ధోర్జీ ఖండూ కూడా హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. 2011 ఎప్రిల్ 30న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ వద్ద ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల హెలికాప్ట‌ర్ కూలిపోయింది.


 ఇంధిరా గాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ 1980 జూన్ 23 ఢిల్లీలోని స‌ఫ్ద‌ర్‌జంగ్ విమానాశ్ర‌యంలో జ‌రిగిన ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. హరియాణాకు చెందిన మంత్రి ఓపీ జిందాల్‌ 2005 మార్చి 31న హెలికాప్ట‌ర్ క్రాష్‌లో ప్రాణాలు కోప్పోయారు. వీరితో పాటు పంజాబ్‌ గవర్నర్‌ సురేంద్ర నాథ్‌, కాంగ్రెస్‌ నేత ఎస్‌ మోహన్‌కుమార్‌ మంగళం,అరుణాచల్‌ ప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి డేడా నటుంగ్‌, కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి ఎన్‌వీఎన్‌ సోము తదితరులు విమాన‌, హెలీకాప్ట‌ర్ ప్ర‌మాదాల్లో మ‌ర‌ణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: