
ఉద్యోగ సంఘాల నేతలుగా బరిలో ఉన్న ఆ నలుగురు తమను బలిపశువులను చేశారని అంటున్నారు.ప్రభుత్వ పెద్ద సజ్జల రామకృష్ణా రెడ్డి తో చర్చలు జరిపిన బండి శ్రీను కానీ వెంకట్రామిరెడ్డి కానీ ఆ ఇద్దరూ వైసీపీ మనుషులు. కనుక వాళ్లను వీరు నమ్మరు. మరో నేత కేవీ సూర్యనారాయణ బీజేపీ మనిషి. ఇంకో నేత అయిన బొప్పరాజు ఓ విధంగా చంద్రబాబు మనిషి అన్న టాక్ కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఒకప్పుడు ఎన్జీఓ లీడర్, ఇప్పటి ఎమ్మెల్సీ అశోక్ బాబుకు చేరువ కనుక. ఈవిధంగా చూసుకుంటే వివిధ పొలిటికల్ పార్టీల బ్యాగ్రౌండ్ తో పనిచేసే నాయకుల కారణంగా తమకు వీరు అన్యాయం చేశారని లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు గగ్గోలు పెడుతున్నారు. చర్చల్లో ఉద్యోగ సంఘాలే తప్ప ఉపాధ్యాయ సంఘాలకు చోటు ఇవ్వకపోవడం కూడా ఓ ఆశ్చర్యకర పరిణామమే! అయితే ఇందులో జగన్ వర్గాల తప్పిదం ఏమీ లేదు.
తాము చర్చలకు ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని, వారితో మాట్లాడేందుకు సిద్ధమేనని, కానీ మినిట్స్ ఫార్మ్ అయ్యాక (ఇరువర్గాల పరస్పర అంగీకారంతో ఒప్పంద పత్రం రూపొందాక) మళ్లీ తమను నిందించడం అన్నది తగదు అని సజ్జల రామకృష్ణా రెడ్డి అంటున్నారు. కనుక ఇందులో జగన్ ను తప్పు పట్టాల్సిన పనే లేదు. కానీ వివాదం మాత్రం ఇప్పట్లో తేలేలా లేదు.అందుకే ఉద్యోగులంతా ఏకతాటిపై నిలిచి మాట్లాడిన దాఖలాలు లేవు అని కూడా ఓ వాదన వస్తోంది. త్వరలో ఉపాధ్యాయులు వారితో పాటు ఇంకొందరు ఉద్యోగులు కూడా రోడ్డెక్కడం ఖాయం అని తెలుస్తోంది.అయితే వీరితో ఆర్టీసీ, విద్యుత్ రంగ సిబ్బంది కలిసి వస్తారా లేదా అన్నదే ఇప్పుడిక కీలకం మరియు సందేహాస్పదం కూడా!
సమ్మెలోకి ఆర్టీసీ వచ్చేందుకు మొదట నుంచి ఇష్టపడడం లేదు..కనుక వాళ్లంతా సైడ్ అయిపోయే ఛాన్సులే ఎక్కువ. అయినా ఆర్టీసీ వాళ్లకు కొత్త పీఆర్సీ వర్తింపు ఉంటుంది అని, వాళ్లకు వేరేగా జీఓ ఇస్తామని సజ్జల చెప్పారు కనుక అది అమలు కాకపోతే అప్పుడు తాము సమ్మెకు వస్తామని సంబంధిత యూనియన్లు అంటున్నాయి. ఇక విద్యుత్ సిబ్బంది కూడా ఇదే వ్యూహంతో ఉన్నాయి. కనుక ఈ సారి ఉపాధ్యాయులు మరియు కొందరు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిసి మళ్లీ ఉద్యమించేందుకు అవకాశాలు ఉన్నా కూడా చలో విజయవాడ స్థాయిలో సామూహిక నిరసనలు తెలిపే సందర్భాలు మాత్రం నెలకొనవని తెలుస్తోంది.