నిన్న మొన్నటి వరకూ కొత్త జిల్లాల ఏర్పాటు అంతా సాఫీగా సాగిపోతుందని అనుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మౌన దీక్ష చేస్తే, దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ప్రతిపక్షాలు ఎన్ని ప్రతిపాదనలు తెచ్చినా ప్రభుత్వం పక్కనపెట్టేస్తుందనే ప్రచారం ఉంది. ఈ దశలో అధికార పార్టీ నుంచి కూడా ఒత్తిడులు మొదలయ్యాయి. రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ అధికార పార్టీ నేతలే ఉద్యమం మొదలు పెట్టారు. ఇక ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మొదలు పెట్టిన పోరాటం మరో లెవల్ లో ఉంది. ఇది అక్కడితో ఆగేలా లేదు. ఎమ్మెల్యే రోజా ఇప్పుడు ఆనం బాటలోకి వచ్చేశారు. ఆమె కూడా తన పోరాటం ఉధృతం చేయబోతున్నారని తెలుస్తోంది. నగరి నియోజకవర్గాన్ని చిత్తూరులో కాకుండా బాలాజీ జిల్లాలో కలపాలని అడుగుతున్నారామె.

ఇటీవల రాజీనామా వార్తలతో రోజా టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారారు. అవన్నీ వట్టి పుకార్లే అని తేలిపోయిన తర్వాత ఇప్పుడు నగరి నియోజకవర్గం విషయంలో ఆమె మరోసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. నగరి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉంది, జిల్లాల విభజన తర్వాత కూడా అది చిత్తూరులోనే కొనసాగుతోంది. కానీ కొత్తగా బాలాజీ జిల్లా ఏర్పడటం, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల, తిరుపతి ఆ జిల్లాలోకి వెళ్లిపోవడంతో నగరి ప్రజలు హర్ట్ అయ్యారంటున్నారు రోజా. తమకి తిరుపతి సెంటిమెంట్ అని అందుకే ఆ జిల్లాలో కలపాలంటున్నారు. నగరిని బాలాజీ జిల్లాలో కలపకపోతే పార్టీకి కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, వామపక్షాలు, వైరి పక్షాలు కూడా ఈ విషయంలో నగరి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాల్లో ఉన్నాయని రోజా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం జగన్ కి ఈమేరకు రోజా లేఖ రాయడంతోపాటు, నేరుగా కలసి తన విన్నపాన్ని చెప్పారట. నగరి నియోజకవర్గం విషయంలో కాస్త సానుకూలంగా ఆలోచించాలని అడిగారట. ఆనం, ఆయన తర్వాత రోజా.. ఇలా వెసులుబాట్లు ఇచ్చుకుంటూ పోతే ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అందుకే జగన్ మాత్రం ఇలాంటి డిమాండ్లను పట్టించుకునేది లేదని చెబుతున్నారట. ఆనం, రోజా, ఇంకెవరు వినతిపత్రాలిచ్చినా పక్కనపెట్టేస్తున్నారట. సీఎం జగన్ కఠినంగానే ఉన్నారు. మరి తమ మాట నెగ్గకపోతే ఎమ్మెల్యేలు ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: