ఇటీవల టీడీపీ అనుకూల మీడియాలో ఏపీ స్కూళ్లపై కొన్ని వ్యంగ్యమైన కథనాలొచ్చాయి. స్కూళ్లలో చాక్ పీస్ లు కొనడానికి కూడా డబ్బుల్లేవని, చాక్ పీస్ ల నిల్వలు నిండుకున్నాయని అందులో వివరించారు. సరిగ్గా ఈ కథనం వచ్చిన రెండురోజులకే సీఎం జగన్ విద్యాశాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టారు. అందులో డిజిటల్ డిస్ ప్లే పై దృష్టి సారించాలని అధికారులకు చెప్పారు. స్మార్ట్ టీవీలు, డిజిటల్ ప్రొజెక్టర్లతో ఇకపై బోధన కొనసాగాలని చెప్పారు. అంటే స్కూళ్లలో ఇకపై చాక్ పీసులే కాదు, బ్లాక్ బోర్డ్ ల అవసరం కూడా ఉండదని, పరోక్షంగా హింట్ ఇచ్చారు జగన్.

ఏపీలోని స్కూళ్లలో ఆధునిక బోధన విధానాలు అనుసరిస్తూ విద్యార్థులకు అత్యుత్తమ రీతిలో అత్యున్నత పరిజ్ఞానాన్ని అందించబోతున్నట్టు తెలిపారు సీఎం జగన్. దీనికోసం ప్రభుత్వ స్కూళ్లలోని  ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ విద్యా బోధన మొదలవుతుందని చెప్పారు. దానికోసం ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన పరికరాలను అందించబోతున్నట్టు చెప్పారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా దీన్ని చేపట్టబోతున్నామని అన్నారు. డిజిటల్ డిస్ ప్లే వ్యవహారంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం జగన్.

పీపీ-1 నుంచి రెండో తరగతి వరకు స్మార్ట్ టీవీలు అందబాటులోకి తేబోతున్నారు. మూడో తరగతి నుంచి పై తరగతుల వరకు ప్రొజెక్టర్లు అందుబాటులోకి తెస్తారు. అంటే ఇకపై డిజిటల్ బోధన మొదలు కాబోతోందనమాట. విద్యార్థులకు సబ్జెక్టులు మరింత బాగా అర్థమయ్యేందుకు ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్‌ డిస్‌ ప్లే ఉండాలని సూచించారు సీఎం జగన్. దీనివల్ల విద్యార్థులతోపాటు, ఉపాధ్యాయులకు కూడా మంచి జరుగుతుందన్నారు. అదే సమయంలో విలువైన వస్తువులు స్కూళ్లకు వస్తాయి కాబట్టి, భద్రతా పరమైన చర్యలు గట్టిగా తీసుకోవాలన్నారు. ప్రతి స్కూల్ లో సీసీ కెమెరాలు అమర్చాలని, సెక్యూరిటీ పెంచాలని సూచించారు. ఇకపై డిజిటల్ బోధనలో ముందడుగు వేయాలన్నారు. త్వరలో 8 వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు ఇస్తామని, వాటిలో బైజూస్ కంటెంట్ ఉంటుందని చెప్పారు సీఎం జగన్. మొత్తమ్మీద నాడు-నేడు తో స్కూళ్ల రూపు రేఖలు మారిపోయినట్టుగానే, ఇప్పుడు కంటెంట్ విషయంలో కూడా పూర్తిగా మార్పులు తీసుకు రావాలని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: