తాజాగా బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు ప్రకటన చూసిన తర్వాత జనసైనికుల్లో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయా ? జనసైనికులకే కాదు మామూలు జనాలకు కూడా ఇదే అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకీ జీవీఎల్ చేసిన ప్రకటన ఏమిటంటే మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో బీజేపీనే పోటీచేస్తుందట. ఉన్న సీట్లన్నింటికీ బీజేపీనే పోటీచేస్తే ఇక మిత్రపక్షం జనసేన ఎక్కడ పోటీచేస్తుంది ?  





వచ్చే ఎన్నికల్లో సీఎం అయిపోదామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలలుకంటున్న విషయం తెలిసిందే. జీవీఎల్ ప్రకటన తర్వాత పవన్ను బీజేపీ నిండా ముంచేసేందుకు సిద్ధంగా ఉందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసలు బీజేపీకి 175 స్ధానాల్లో గట్టి అభ్యర్ధులున్నారో లేదో కూడా తెలీదు. ఎవరినైనా పోటీకి దింపినా వాళ్ళల్లో ఎంతమంది డిపాజిట్లు తెచ్చుకుంటారో లేదో కూడా తెలీదు. అలాంటి పార్టీ అన్నీస్ధానాల్లో బీజేపీనే పోటీచేస్తుందని ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది.





నిజానికి జనసేనతో పొత్తుల్లో పోటీచేస్తే కూడా బీజేపీకి గట్టి అభ్యర్ధులు దొరికేది అనుమానమే. ఎందుకంటే కమలంనేతలంతా కేవలం మీడియా సమావేశాల్లోను, టీవీ చర్చల్లో మాత్రమే కనబడుతుంటారు. ఎవరిదాకానో అవసరంలేదు చాలా పెద్దమాటలు మాట్లాడుతున్న రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎంఎల్ఏగా పోటీచేస్తే డిపాజిట్ వస్తుందనే  గ్యారెంటీలేదు. బీజేపీ+జనసేన మాత్రమే పోటీచేస్తే రెండుపార్టీల అభ్యర్ధులు తుక్కుకింద ఓడిపోవటం ఖాయం. ఈరెండుపార్టీల అభ్యర్ధులు పోటీచేసిన సీట్లలో అయితే వైసీపీ లేదా టీడీపీ అభ్యర్ధులు గెలవటానికే ఎక్కువ అవకాశాలున్నాయి.





ఏదో ఢిల్లీలో అధికారంలో ఉందికాబట్టే జీవీఎల్, సోమువీర్రాజు లాంటివాళ్ళంతా ఏపీలో తెగ సౌండ్ చేస్తున్నారు. 2014కి ముందు అసలు ఇలాంటి నేతలు బీజేపీలో ఉన్నారని కూడా చాలామందికి తెలీదు. ముందు మిత్రపక్షం జనసేనను ఏమిచేయదలచుకున్నారో చెప్పి ఆ తర్వాత 175 సీట్లకు బీజేపీ పోటీచేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అలాచెప్పకుండా జనసేనను పక్కనపెట్టేసి అన్నీ నియోజకవర్గాల్లోను తామే పోటీచేస్తామని ప్రకటిస్తే జనాలు నవ్వుకుంటారని కూడా జీవీఎల్ మరచిపోయినట్లున్నారు. ఇలాంటి పార్టీని నమ్ముకుంటే పవన్ నిండాముణిగిపోవటం ఖాయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: