‘విశాఖపట్నం రాజధాని కోసం తాను రాజీనామా చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాను’..ఇవి తాజాగా రెవిన్యుశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు. శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లిలో గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో మాట్లాడుతు విశాఖను రాజధానిగా కాదంటే తాను మంత్రిగా రాజీనామా చేస్తానంటు ప్రకటించారు. రాజధాని కోసం మంత్రిపదవికి రాజీనామా అని ధర్మాన ప్రకటించారంటే ఇలాంటి ప్రకటనలే మిగిలిన మంత్రులు చేయటం కూడా ఖాయం.





ఎందుకంటే రాజధాని కోసం మంత్రిపదవులను సైతం త్యాగం చేశారని చెప్పుకుని ఒత్తిడి పెంచటమే ముఖ్య ఉద్దేశ్యం. ప్రత్యేక తెలంగాణా ఉద్యమసమయంలో కూడా అప్పట్లో ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ మంత్రులపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. వాళ్ళ ఒత్తిడిని తట్టుకోలేక కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కొందరు మంత్రిపదవులకు రాజీనామాలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రులే రాజీనామాలు చేశారనే విషయం అప్పట్లో ఉద్యమానికి బాగా ఊపునిచ్చింది.





ఇపుడు ప్రభుత్వమే విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించింది. అయితే ప్రతిపక్షాలన్నీ అడ్డుకుంటున్నాయి. హైకోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఇది సరిపోదన్నట్లుగా అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్ తో అమరావతి జేఏసీ పేరుతో కొందరు పాదయాత్రను మొదలుపెట్టారు. అమరావతి టు అరసవల్లి పాదయాత్రను ప్రశాంతంగా చేసుకుంటే ఎవరికీ ఇబ్బందులు ఉండవు. కానీ వీళ్ళు మూడు రాజధానులకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. దీన్నే మంత్రులు బొత్సా సత్యనారాయణ, ధర్మాన, అమర్ నాధ్, సీదిరి అప్పలరాజు తప్పు పడుతున్నారు.





ఈ నేపధ్యంలోనే ఉత్తరాంధ్ర జనాల్లో సెంటిమెంటును రగిల్చేందుకు ధర్మాన హఠాత్తుగా రాజీనామా ప్రకటన చేశారు. ఉత్తరాంధ్రలో జరుగుతున్నది చూస్తుంటే పాదయాత్ర ఉత్తరాంధ్ర సరిహద్దులు తాకగానే గొడవలు అయ్యేట్లే ఉంది. ఎందుకంటే పాదయాత్ర మొదలైన దగ్గర నుండి జేఏసీ నిర్వాహకులు మిగిలిన ప్రాంతాల జనాలను రెచ్చగొడుతునే ఉన్నారు. ఈ నేపధ్యంలోనే  ఉత్తరాంధ్రలో కూడా సెంటిమెంటు రగిలితే పాదయాత్ర విశాఖపట్నం చేరుకునేసరికి వాతావరణం ఉద్రిక్తతంగా మారే ప్రమాదముంది. మరి జేఏసీ నిర్వాహకులు ఏమిచేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: