తెలుగుదేశంపార్టీ నేతలు అనవసరంగా జూనియర్ ఎన్టీయార్ తో గోక్కుంటున్నట్లే ఉన్నారు. ప్రతి విషయానికీ అధికార వైసీపీ లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూనియర్ స్పందించాలంటు తమ్ముళ్ళు చేస్తున్న రచ్చ మరీ అతిగా ఉంటోంది. రాజకీయాలకు దూరంగా సినిమాల్లో తనపనేదో తాను చేసుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని తమ్ముళ్ళు ఎందుకు గోకిగోకి వ్యతిరేకం చేసుకుంటున్నారో అర్ధం కావటంలేదు. రెగ్యులర్ గా ఏదో విషయంలో జూనియర్ను కెలుకుతునే ఉన్నారు.





ఇపుడిదంతా ఎందుకంటే అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండుతో పాదయాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యాత్రలో కొందరు మహిళా నేతలు జూనియర్ ను చాలా అవమానకరంగా మాట్లాడారు. అమరావతికి మద్దతుగా రైతులపక్షాన జూనియర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలన్నది వీళ్ళ డిమాండ్. ప్రభుత్వాన్ని తప్పుపడుతు మాట్లాడలేదని మంట. అందుకనే పాదయాత్రలోనే ఒక మహిళతో జూనియర్ ను నానా మాటలనిపించారు.





ఆమె మాట్లాడుతు అసలు జూనియర్ ఎన్టీయార్ మనవడేనా అని అనుమానం వ్యక్తంచేసింది. జూనియర్ గనుక నిజంగానే ఎన్టీయార్ మనవడు అయితే వెంటనేవచ్చి ఉద్యమంలో పాల్గొనాలన్నట్లుగా డిమాండ్ చేశారు. రైతులను పట్టించుకోని జూనియర్ ఎన్టీయార్ మనవడు అయితే ఏమిటి ...ఏమిటంటు చాలా ఘాటుగా మాట్లాడారు. పైగా దీన్ని వీడియోచేసి సోషల్ మీడియాలో పోస్టు కూడా చేశారు. దాంతో ఈ వీడియో ఇపుడు వైరల్ అయ్యింది. వీడియోను చూడగానే జూనియర్ అభిమానసంఘాలు మండిపోతున్నాయి.





రాజకీయాలకు దూరంగా ఉండి సినిమాలు చేసుకుంటున్న జూనియర్ను టీడీపీ నేతలు ఎందుకు అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారంటు అభిమానసంఘాల నేతలు కృష్ణ, గణేష్ మండిపోతున్నారు. జూనియర్ ను తిట్టినవారిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలంటు టీడీపీకి జూనియర్ అభిమానులు ఫిర్యాదుచేశారు. టీడీపీ గనుక యాక్షన్ తీసుకోకపోతే తాము పాదయాత్రను అడ్డుకోవటం ఖాయమని అల్టిమేటమ్ కూడా జారీచేశారు. జూనియర్ పై చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా వార్నింగ్ ఇచ్చారు. చివరకు ఈ గొడవ ఎక్కడిదాకా వెళుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: