హైదరాబాద్‌ శివార్లలో పులి తిరుగుతుందన్న వదంతులు కొన్ని ఏరియాల్లో కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఏకంగా రెసిడెన్షియల్‌ ఏరియాలో పులి వచ్చిందన్న వార్తలు జనాన్ని పరుగులు పెట్టించాయి. అందులోనూ కొందరు చిరుతను చూశామని చెప్పడం హైదరాబాద్ ప్రగతినగర్‌ వాసులను హడలెత్తించింది.


గీతాంజలి పాఠశాలలోని ఓ గదిలో చిరుత నక్కిందన్న ప్రచారం జరిగింది. స్కూల్‌ గోడపై చిరుత లాంటి జంతువు తిరుగుతున్నట్లు సీసీ కెమెరా దృశ్యాలు బయటకు రావడంతో మరింత భయాందోళనకు గురయ్యారు. వామ్మో... పులి.. అంటూ జనం భయంతో గడిపారు. ప్రగతి నగర్ శివారు ప్రాంతం.. ఆ తర్వాత అంతా చిట్టడవిలా ఉంటుంది. అందుకే జనం కూడా నిజంగా పులి వచ్చిందేమో అనుకున్నారు.


అందులోనూ ఇదిగో పులి అంటే .. అదుగో తోక అనేవాళ్లు ఎక్కువగా.. అలా అలా కాలనీ ఏరియా అంతా ఆ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది. ఓ బండరాయి దగ్గర చిరుత సంచరిస్తోందని మంగళవారం రాత్రి వాట్సప్‌లో ఓ వీడియో కలకలం సృష్టించింది. పులి గాండ్రింపు శబ్దాలు వినిపించాయని కొందరు... చిరుత ఆకారం కూడా కనిపించిందని మరికొందరు చెప్పారు.


చివరు స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు, ఫారెస్ట్‌ అధికారులు అక్కడికి వచ్చారు. దాన్ని బంధించేందుకు వలలు ఏర్పాటు చేశారు. చిరుతను పట్టుకునేందుకు బోను కూడా సిద్ధం చేశారు. కానీ ఎంత వెదికినా ఆ భవనంలో చిరుత ఆనవాళ్లేవీ కనిపించకపోవడంతో... అంతా ఉట్టిదేనని నిర్ధారణకు వచ్చారు.


చివరకు అక్కడ లభించిన వెంట్రుకలను పరిశీలించి... సాధారణ పిల్లి అని నిర్ధారించారు. స్థానికంగా ఉన్న ఫర్నీచర్ తయారీ పరిశ్రమ నుంచి వచ్చిన శబ్దాలనే పులి గాండ్రింపులుగా భావించి ఉంటారని పోలీసులు, అటవీసిబ్బంది అనుమానిస్తున్నారు. చివరకు ఫారెస్ట్‌ అధికారులు పులి కాదు... పిల్లి అని తేల్చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.


ప్రగతినగర్‌లో చిరుతపులి ఉందన్న వార్తల్ని ఫారెస్ట్‌ ఆఫీసర్‌ శ్రీదేవి కొట్టిపారేశారు. అసలు నగరంలోకి చిరుతలు వచ్చే అవకాశమే లేదని క్లారిటీ ఇచ్చారు. చివరకు గీతాంజలి స్కూల్‌లో చిరుతపులి ఉందని ప్రచారం చేసిన వాచ్‌మన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: