2009, సెప్టెంబర్‌ 3.. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉత్కంఠగా ఎదురు చూసిన రోజు.. ఆ రోజు ప్రతిక్షణం ఉద్వేగమే.. ప్రతి క్షణం ఉత్కంఠ భరితమే.. అంతకుముందురోజు రచ్చబండ కోసం హెలికాప్టర్ లో బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆచూకీ కనిపించకపోవడమే అందుకు కారణం.. కానీ సెప్టెంబర్ 3 వ తారీఖు.. ఉదయం 11 గంటల సమయంలోనే ఇక ముఖ్యమంత్రి మనకు లేరన్న వార్త వెల్లడైంది.


హెలికాప్టర్ పావురాలగుట్ట సమీపంలో కూలిందని తెలిసింది. అయితే.. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించినప్పటికీ ఆ ప్రాంతానికి వెళ్లడానికి పోలీసులు, మీడియా, రాజకీయ నాయకులు, స్థానికులు, చెంచులు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. ప్రమాదం జరిగిన ప్రాంతం అత్యంత దట్టమైంది కావడమే అందుకు కారణం. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని నల్లకాలువ గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని రుద్రకోడూరు గ్రామానికి దట్టమైన అటవీ మార్గంలో వెళ్లాల్సి ఉంది.


అక్కడికి ప్రమాద స్థలి మరో 16 కిలోమీటర్లు దూరం. కాలినడకన వెళ్లేందుకు ప్రయత్నించిన విలేకరులు, ఫొటోగ్రాఫర్లు, పోలీసులు కూడా దారి తప్పారు. వైమానిక సిబ్బంది కూడా 1.30 గంటల వరకు ప్రయత్నించి సాధ్యం కాక, హెలికాప్టర్ల ద్వారా కిందకు దిగి మృతదేహాలను తాళ్లతో కట్టి తరలించాలని నిర్ణయించారు. వైమానిక దళ కమెండోలు, చెంచులు తాళ్ల సహాయంతో కిందకి దిగి మృతదేహాల శకాలను సేకరించారు. చెల్లా చెదురుగా పడివున్న మాంసపు ముద్దలను ఏరి గుడ్డ సంచులలో చేర్చి తాళ్ల ద్వారానే హెలికాప్టర్లలోకి చేర్చారు.


మధ్యాహ్నం 2.20 గంటలకు భారత వైమానిక దళం హెలికాప్టర్లలో ముఖ్యమంత్రి వైఎస్ పార్థివదేహంతో పాటు పైలెట్లు, భద్రతా అధికారుల భౌతికకాయాలను కర్నూలుకు తీసుకువచ్చారు. కర్నూలులో ముఖ్యమంత్రి వైఎస్ మృతదేహానికి పోస్టుమార్టం, కర్నూలు రెండో బెటాలియన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో శవపరీక్షలు నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు కర్నూలు నుండి హైదరాబాదుకు బయలుదేరిన ప్రత్యేక హెలికాప్టర్లు ఐదు గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నాయి. తరువాత బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయానికి మృతదేహన్ని తరలించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: