తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ రెండు రోజుల క్రితం ఆర్టీసీలో ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రేపటి నుండి పెరిగిన ఛార్జీలు అమలులోకి రానున్నాయి. ఆర్టీసీ అధికారులు ఛార్జీల పెంపుపై కసరత్తును కొనసాగిస్తున్నారు. అధికారులు పెరిగిన ఛార్జీల పట్టికను ఈరోజు విడుదల చేయనున్నారు. ఆర్టీసీ అధికారులు కిలోమీటర్ కు 20పైసల చొప్పున ఛార్జీలను పెంచుతూ పూర్తి నివేదికను సీఎం కేసీఆర్ కు ఇప్పటికే అందజేశారు. 
 
పల్లె వెలుగు బస్సుల్లో కనీస టికెట్ ధర 8 రూపాయలుగా ఫిక్స్ చేయగా అర్డినరీ బస్సుల్లో కనీస టికెట్ ధర 10 రూపాయలుగా నిర్ణయించారు. కొత్తగా పెరగనున్న ఛార్జీల ద్వారా ప్రభుత్వానికి అదనంగా 752 కోట్ల రూపాయల రాబడి రానున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఛార్జీలను పెంచినట్లుగా విద్యుత్ ఛార్జీలను కూడా పెంచడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ ఛార్జీలు పెంచటానికి కసరత్తు పూర్తి చేసింది. 
 
ప్రభుత్వ వర్గాలు మున్సిపల్ ఎన్నికల ముందు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచబోదని చెబుతున్నాయి. విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోందని సమాచారం.  ఈఆర్సీ ఛైర్మన్ హైదరాబాద్ లో లేకపోవటం వలన ఛార్జీల పెంపు ప్రకటన వాయిదా పడిందని తెలుస్తోంది. విద్యుత్ కార్మికులకు ఈ మధ్య కాలంలో జీతాలు భారీగా పెరిగాయి. 
 
విద్యుత్ కార్మికులకు జీతాలు పెరగటం వలన ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఉత్పత్తి కోసం ఖర్చు చేస్తోంది. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచని పక్షంలో విద్యుత్ సంస్థల డిస్కంలు నష్టాల్లో కూరుకుపోయే అవకాశం ఉందని జెన్ కో అధికారులు, ట్రాన్స్ కో ఆధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ ఛార్జీలు భారీగా పెరగటంతో ప్రజల్లో ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: