మర్కజ్‌ ఘటనతో ఏపీలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోయాయి. మర్కజ్‌కు ముందు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీలో చాలా తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదు అయినప్పటికీ.. ఆ తర్వాత వేగం పుంజుకున్నాయి. అయితే ఈ ప్రభావం ఏ మేరకు ఉంటుంది. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో కొంత మందికే ఇది పరిమితం అవుతుందా..? లేక ఈ వైరస్‌ మరింతగా విస్తరిస్తుందా..? ప్రస్తుతం ప్రభుత్వ వర్గాలు ఇదే విషయాన్ని విశ్లేషించే పనిలో పడ్డాయి.

 

ఏపీలో కరోనా పాజిటీవ్‌ కేసుల్లో అత్యధికం మర్కజ్‌ ఘటనతో లింకు ఉన్నవే కన్పిస్తున్నాయి. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిని కనిపెట్టడంతోపాటు.. వారి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ పైనా ఆరా తీస్తోంది ఏపీ సర్కార్. అనుమానమున్న ప్రతి ఒక్కరిని క్వారంటైన్‌కు తరలించడం.. వారి శాంపిళ్లను కలెక్ట్‌ చేసి ల్యాబులకు పంపుతోంది వైద్యారోగ్య శాఖ. ప్రస్తుతం ఏపీలో నమోదవుతున్న ప్రతి పాజిటీవ్‌ కేసు మర్కజ్‌తో సంబంధం ఉందనే భావన అందరిలోనూ ఉంది. అయితే ఇది ఎంత వరకు వాస్తవం..?  ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో మెజార్టీ మందికి కరోనా సోకిందా..? వ్యాధి సోకిన వారి నుంచి మిగిలిన వారికి ఈ వ్యాప్తి ఏ స్థాయిలో ఉంది అనే అంశంపై ఏపీ సర్కార్‌ అంచనా వేస్తోంది. దీనికి సంబంధించి అధికారికంగా ప్రభుత్వం లెక్కలు చెప్పకున్నప్పటికీ.. తీసుకోవాల్సిన జాగ్రత్తల దృష్ట్యా తమ వద్దనున్న సమాచారాన్ని బేస్‌ చేసుకుని మర్కజ్‌ కేసులను విశ్లేషిస్తోంది ఏపీ ప్రభుత్వం.

 

ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రం నుంచి 1085 మంది మర్కజ్‌కు వెళ్లారు. వీరిలో రాష్ట్రానికి తిరిగి వచ్చిన సంఖ్య 946కాగా.. ఇంకా మిగిలిన 139 మంది ఢిల్లీలోనో.. వివిధ రాష్ట్రాల్లోనో చిక్కుకుపోయి ఉన్నారు. ఈ క్రమంలో ఇలా వెళ్లి వచ్చిన వారికి.. వారి సంబంధింకులకు మొత్తంగా చూస్తే సుమారు 200 మందికి పైగా కరోనా పాజిటీవ్‌ కేసు సోకింది. దీంతో ప్రభుత్వం ఒక్కసారిగా అలెర్ట్‌ అయింది. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిని.. వారి కాంటాక్ట్సును క్వారంటైన్‌కు తరలిస్తోంది. ఓ వైపు ఈ తరహా చర్యలు తీసుకుంటూనే.. ఢిల్లీ నుంచి వచ్చిన వారి ద్వారా వైరస్‌ వ్యాప్తి ఏ స్థాయిలో ఉంటుందోననే దిశగా లెక్కలు వేస్తోంది. ఈ క్రమంలో ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా కన్పిస్తోంది. కర్నూలు జిల్లా నుంచి అత్యధికంగా మర్కజ్‌కు వెళ్లి వచ్చారనేది ప్రభుత్వం వద్దనున్న లెక్క. కానీ అక్కడ పాజిటీవ్‌ కేసుల సంఖ్య ఎక్కువగానే నమోదు అవుతున్నప్పటికీ.. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు వంటి జిల్లాలతో పోలిస్తే తక్కువగానే ఉంది. పైగా ఈ మూడు జిల్లాల్లోనూ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి సంఖ్య కర్నూలు జిల్లా కంటే తక్కువగానే ఉంది. కర్నూలు జిల్లాలో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి సంఖ్య సుమారు 400 మందిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆ జిల్లాలో ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారికి సంబంధించిన పాజిటివ్‌ కేసుల సంఖ్య 26గా ఉంది. అదే నెల్లూరు జిల్లా విషయానికొస్తే.. ఆ జిల్లా నుంచి ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి సంఖ్య 110గా ఉంటే.. అక్కడి నుంచి నమోదైన కేసుల సంఖ్య 33 కాగా.. కృష్ణా జిల్లాలో 103 మంది వెళ్తే.. ఈ జిల్లాలో ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారికి.. వారి సంబంధీకులకు కలిపి 20 మందికి సోకింది. ఈ లెక్కన చూస్తే ఎక్కువ మంది వెళ్లిన కర్నూలు జిల్లాలో తక్కువ కేసులు.. తక్కువ మంది వెళ్లిన నెల్లూరు, కృష్ణా వంటి జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

 

ఇక అనంతపురం జిల్లాలో ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి సంఖ్య 77గా ఉంటే.. వారందరికీ నెగెటీవ్‌ రిపోర్టే వచ్చింది. దీన్ని ఏ విధంగా విశ్లేషించాలో వైద్యారోగ్య శాఖ వర్గాలకు అర్థం కావడం లేదు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో చాలా మందికి ఈ వైరస్‌ సోకుతుందని.. అసలు దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి విషయంలో అతి పెద్ద హాట్ స్పాట్‌గా ఉన్న మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిలో ఒక్కరికి కూడా కరోనా పాజిటీవ్‌ కేసు ఇప్పటికీ ఒక్కటి కూడా నమోదు కాకపోవడం చూసి అధికారులు విస్తుపోతున్నారు. అలాగే విజయనగరం జిల్లాలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఆ జిల్లా నుంచి మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారు కేవలం ముగ్గురే ఉన్నారు. ఆ ముగ్గురుకి కూడా కరోనా టెస్టుల్లో నెగెటీవ్‌ రిపోర్టులే వచ్చాయి. ఇక గుంటూరు జిల్లాలో ఢిల్లీకి వెళ్లి వచ్చిన వాళ్లల్లో ఓ కుటుంబంలో మొత్తంగా ఐదుగురికి కరోనా పాజిటీవ్‌ సోకగా.. మరో కుటుంబంలో ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారికి కరోనా పాజిటీవ్‌ సోకినా.. ఆ కుటుంబంలోని వారికి ఈ వైరస్‌ సోకలేదు. ఇలాంటి వాటిని కేస్‌ స్టడీగా తీసుకుంటున్నారు అధికారులు.

 

ఈ క్రమంలో కరోనా వ్యాప్తి అనేది ఊహించిన స్థాయిలో ఉండదేమో.. టచ్‌ చేసిన ప్రతి ఒక్కరికి కరోనా వైరస్‌ సోకదేమోననే భావన కొందరిలో వ్యక్తమవుతున్నా.. జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయంలో మాత్రం పక్కాగా లేకుంటే ప్రమాదమేననేది అధికారుల భావనగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: