
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రపంచంలోని అన్ని దేశాలనూ పట్టిపీడిస్తోంది. చిన్నచిన్న దేశాలేకాదు.. అగ్రరాజ్యం అమెరికా కూడా చిగురుటాకులా వణికిపోతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది దీనిబారినపడుతున్నారు. వేలాదిమంది ప్రాణాలను కోల్పోతున్నారు. సామాన్యుడి నుంచి దేశాధినేతల వరకు ఎవ్వరినీ వదలడం లేదు. ఇప్పటికే స్పెయిన్ యువరాణి కరోనా కాటుకు బలయ్యారు. ఈ ఘటన ఆ దేశంలో కలకలం రేపింది. తాజాగా.. లిబియా మాజీ ప్రధాని మహ్మూద్ జిబ్రిల్(73) కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు. కరోనా పాజిటివ్ వచ్చినప్పటి నుంచి ఆయన ఈజిప్టులోని ఓ దవాఖానలో మార్చి 27 నుంచి చికిత్స తీసుకుంటున్నారు. అయితే.. కొన్ని రోజుల నుంచి శ్వాస తీసుకోవడం బాగా కష్టమైపోవడంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి, ఆదివారం తుది శ్వాశ విడిచారు. ఇలా అనేక దేశాల్లో పలువురు ప్రముఖులు కరోనా బారిన పడి మృతి చెందుతున్నారు. ఈ పరిణామాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
అమెరికాలో ఇటీవల భారత సంతతికి చెందిన ప్రపంచ చెఫ్ కూడా మరణించారు. ఓ గాయకుడు కూడా మృతి చెందారు. ఇదిలా ఉండగా.. మరికొందరు దేశాధినేతలు, ప్రముఖులు కరోనాతో బాధపడుతున్నారు. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా కరోనా బారినపడి, చికిత్సపొందుతున్నారు. స్పెయిన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చార్లెస్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్‌క కూడా కరోనా బారిపడ్డారు. ఇలా దాదాపుగా అన్నిరంగాలకు చెందిన ప్రముఖుల్లో చాలావరకు కొవిడ్- 19తో బాధపడుతున్నారు. అయితే.. అంతర్జాతీయంగా వీరి పర్యటనలు ఉండడమే ఇందుకు ప్రధాన కారణమని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మాత్రం రెండుసార్లు పరీక్షలు జరిపినా కొవిడ్-19 నెగెటివ్ రావడం గమనార్హం. ఇదే సమయంలో వైట్‌హౌస్‌లో కూడా కరోనా కలకలం రేపుతోంది. అక్కడి సిబ్బందిలో పలువురు కొవిడ్-19బారిన పడుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 68వేలమంది కరోనాతో మృతి చెందారు. సుమారు 12లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.