ఆంధ్రప్రదేశ్‌లోనూ క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రత్యేకించి కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి జోరుగా ఉంది. రెండు జిల్లాలోనూ కేసులు 80 దాటాయి. అందుకే కట్టడి చేసేందుకు కట్టుదిట్టంగా లౌక్‌డౌన్‌ అమలు సహా పలు చర్యలు తీసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 8 మండలాలు రెడ్‌జోన్ పరిధిలో ఉన్నాయి.

 

 

గుంటూరు జిల్లాలో కరోనా అంతకంతకూ వ్యాపిస్తోంది. ఒక్కరోజే 14 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 89కి చేరింది. వీటిలో 67 కేసులు గుంటూరు అర్బన్ పరిధిలోనే ఉన్నాయి. ఆదివారం ఒక్కరోజే 14 కేసులు బయటపడ్డాయి. రెండు రోజుల వ్యవధిలో 31 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 3 మండలాలను రెడ్‌జోన్‌ పరిధిలో ఉంచారు. గుంటూరు నగరం మొత్తం రెడ్‌జోన్‌లోనే ఉంది. 

 

 

గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో పాజిటివ్ కొత్త కేసులు నమోదయ్యాయి. అనుమానితులను ఎప్పటికప్పుడు గుర్తించి పరీక్షలకు పంపుతున్నారు. మాచర్ల, అచ్చంపేటలో ఇప్పటికే పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. నరసరావుపేటలోనూ కొత్త కేసులు నమోదయ్యాయి. అటు కర్నూలు జిల్లాలోనూ కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్టపడటం లేదు. కొత్తగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 

 

 

కర్నూలు జిల్లాలో మొత్తం 84 మంది కరోనాతో బాధపడుతున్నారు. బాధితులకు రెండు కోవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. అందరి పరిస్థితీ మెరుగ్గానే ఉందని అధికారులు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున  జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 8 మండలాలు  రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి. రెడ్ జోన్లలో ఉన్న ప్రజలు బయటికి రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

 

 

ఈ రెండు జిల్లాల్లో కరోనా కట్టడి కోసం బహిరంగ ప్రదేశాలలో నిత్యావసరాల పంపిణీపై జిల్లా యంత్రాంగం ఆంక్షలు విధించింది.  నేరుగా కాకుండా పట్టణాల్లో కమిషనర్లకు, మండలాల్లో ఎంపీడీవో, తహశీల్దార్లకు సరకులు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సరకులను మెప్మా, డ్వాక్రా, వార్డు, గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: