ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కు ఏమైంది..? ప్రస్తుతం కరోనా తర్వాత వినిపిస్తున్న వార్తల్లో ఇదే ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే తాజాగా ఆ దేశం కిమ్ పై వస్తున్న వదంతులకు చెక్ పెట్టింది.

 

గత కొద్ది రోజులుగా ఉత్తర కొరియా నియంత పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి బాగలేదని వార్తలు వస్తున్నాయి. కిమ్ గుండెకు శస్త్ర చికిత్స చేయడం వల్ల పరిస్థితి చేయిదాటిపోయిందని వివిధ కథనాలు వెలువడ్డాయి. అందుకు ఎన్నో కారణాలున్నాయి.. ఈ నెల 15న కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన తాత జయంతి కార్యక్రమానికి హాజరుకాలేదు. ఉత్తర కొరియాకు అది చాలా ముఖ్యమైన వేడుక.. గతంలో ఎన్నడూ ఈ వేడుకకు కిమ్‌ గైర్హాజరైన సందర్భం లేదు.. దాంతో ఆనాటి నుంచి ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నెల 11న అధికార వర్కర్స్‌ పార్టీ సమావేశానికి కిమ్‌ అధ్యక్షత వహించారు. ఆ మరుసటి రోజున కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. యుద్ధవిమానాలను పరిశీలిస్తూ చివరిసారిగా అధికారిక మీడియాలో కనిపించారు.. అప్పటి నుంచి ఆయన ఆచూకీ లేరు.

 

గత ఏడాది ఆగస్టు నుంచి ఆయనకు గుండె సమస్యలు ఎక్కువైనట్లు.. దాంతో ఈ నెల 12న ఆయనకు హ్యాంగ్‌సాన్‌ కౌంటిలోని ఒక విల్లాలో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నారని.. అయితే గుండె శస్త్రచికిత్స తర్వాత కిమ్‌ ఆరోగ్యం విషమించిందని అమెరికా మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా అధ్యక్షుడి భద్రతా సలహాదారు మూన్‌ చుంగ్‌ ఇన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కిమ్‌ బతికే ఉన్నారని, అతని ఆరోగ్యానికి ఢోకా లేదని స్పష్టం చేశారు. సీఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో ఆయన మాట్లాడుతూ.. మా ప్రభుత్వం అన్ని పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది అని పేర్కొన్నారు. ఉత్తర కొరియాకు తూర్పు ఉన్నత ప్రాంతంలోని వాన్‌సన్‌లో కిమ్‌ ఏప్రిల్‌ 13 నుంచి ఉంటున్నట్టు చుంగ్‌ ఇన్‌ తెలిపారు. అతని ఆరోగ్యంపై గాని మరే విషయాల్లో గాని ఎలాంటి అనుమానాస్పద కదలికలు లేవని అన్నారు.

 

అలాగే పొరుగునే ఉన్న దక్షిణ కొరియా మాత్రం కిమ్‌ ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో నిజం లేదని మొదటి నుంచి చెప్తూ వస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. నార్త్ కొరియాలోని రిసార్ట్‌ టౌన్‌లో కిమ్‌ కుంటుంబ సభ్యులకు మాత్రమే సేవలందించే ప్రత్యేక ట్రైన్‌ ఏప్రిల్‌ 21, 23 తేదీల్లో కనిపించినట్టు ఉత్తర కొరియాలో పనిచేస్తున్న వాషింగ్టన్‌ బేస్డ్‌ పర్యవేక్షణ ప్రాజెక్ట్.. 38 నార్త్‌ వెల్లడించింది. శాటిలైట్‌ దృశ్యాల్లో లీడర్‌షిప్‌ స్టేషన్‌లో కిమ్‌ ఫ్యామిలీకి సేవలందించే ప్రత్యేక ట్రైన్‌ ఆచూకీ బయటపడిందని పేర్కొంది. ఆ రైలులో కిమ్‌ ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయని అభిప్రాయడింది. ఒకవేళ కిమ్‌ ఆరోగ్య పరిస్థితి బాగోలేని పక్షంలో రైలు అక్కడ ఉండే అవకాశమే లేదని వెల్లడించింది. కిమ్ విషయంలో ఉత్తర కొరియా క్లారిటీ ఇస్తున్నా.. వదంతులు మాత్రం ఆగడం లేదు. మరి కిమ్ కు ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేవని తెలియాలంటే.. స్వయంగా కిమ్ నే వచ్చి చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: