తిరుమల తిరుపతి వెంకన్నకు చెందిన భూములను అమ్మాలని టీటీడీ తీసుకున్న నిర్ణయంపై అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో జగన్ సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఆస్తుల విక్రయాన్ని చేపట్టవద్దని ప్రభుత్వం టీటీడీని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 లో అప్పటి టిటిడి బోర్డు ఆస్తుల అమ్మకానికి సంబందించి తీసుకున్న నిర్ణయాన్ని కూడా నిలుపుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

 

 

2016లో అప్పట్లో ఏభై ఆస్తుల విక్రయానికి టిటిడి బోర్డు తీర్మానం చేసింది. అయితే ఇప్పుడు దాన్ని కూడా నిలుపుదల చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాదు.. ఈ అంశాన్ని స్వామీజీలు, ధార్మిక వేత్తలతో పరిశీలింప చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులలో తెలిపింది.టిటిడి భూములలో హిందూ ధార్మిక కార్యక్రమాలు చేపట్టడం గురించి చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం సూచించింది. ఈ ఉత్తర్వులతో తిరుపతి వెంకన్న భూముల అమ్మకం వివాదం సద్దుమణిగినట్టే భావించాలి.

 

 

అయితే ఈ విషయంలో జగన్ సర్కారు చురుగ్గా వ్యవహరించకుండా కాలయాపన చేయడం ద్వారా చెడ్డపేరు మూటగట్టుకున్నట్టయింది. తిరుపతి వెంకన్నకు సంబంధించిన ఏ విషయాన్నైనా భక్తులు చాలా సెంటిమెంట్ గా ఫీలవుతారు. అది గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయమైనా.. ఇప్పుడు అధికారంలో ఉన్నది జగన్ కాబట్టి మరికాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

 

 

వేలం కోసం ఇచ్చిన ప్రకటన వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే.. ఇవిగో నిజాలు అంటూ మీడియా మందు ప్రకటించింది. దాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తే జగన్ సర్కారుపై విమర్శలు వచ్చేవి కావు. గత ప్రభుత్వం చేపట్టింది కదా మనమూ అదే చేద్దాం అని అనుకుంటే ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందులోనూ తిరుపతి వెంకన్న విషయంలో ఇంకాస్త జాగ్రత్త అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: