హైదరాబాద్ మహానగరంపై కరోనా పంజా విసురుతోంది. నగరంలో కరోనా కేసుల సంఖ్య 6వేల మార్కు దాటింది. నిన్న ఒక్కరోజే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 713 మందికి వైరస్ నిర్ధారణ అయింది. నగర శివారులోని హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో కూడా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మృతుల సంఖ్య 217కు చేరగా వీరిలో ఎక్కువ మంది ఇతర వ్యాధులతో బాధ పడుతున్న వారేనని అధికారులు చెబుతున్నారు. 
 
అన్ లాక్ 1.0 సడలింపులు అమలులోకి వచ్చినప్పటి నుంచి నగరంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లలో పని చేసే సిబ్బంది సైతం వైరస్ భారీన పడటం గమనార్హం. వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 15 జాగ్రత్తలతో కూడిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను పాటిస్తే కరోనాపై సులువుగా గెలుపు సాధించే అవకాశం ఉందని చెబుతోంది. 
 
* ఇతరులతో మాట్లాడే సమయంలో షేక్ హాండ్ ఇవ్వకుండా నమస్కారం చేయాలి. 
 
* వ్యక్తికి, మరో వ్యక్తికి మధ్య కనీసం ఆరు అడుగుల దూరం ఉండాలి. 
 
* ముఖానికి తప్పనిసరిగా మాస్కును ధరించాలి. 
 
* కళ్లు, ముక్కు, నోరును చేతులతో ఎట్టి పరిస్థితుల్లోను తాకకూడదు. 
 
* చేతులను సబ్బు లేదా శానిటైజర్ తో తరచూ శుభ్రం చేసుకోవాలి. 
 
* పరిశుభ్రత చర్యలు పాటించటం ద్వారా శ్వాస సంబంధిత సమస్యల భారీన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. 
 
* ఆత్రుత, ఒత్తిడికి గురైతే నిపుణుల సహాయసహకారాలు తీసుకోవాలి. 
 
* జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1075, రాష్ట్ర హెల్ప్ లైన్ నంబర్ 104కు కాల్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. 
 
* విశ్వసనీయత కలిగిన వ్యక్తులు, సంస్థల నుంచి మాత్రమే కరోనాకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి. 

* అసత్య వార్తలను ఫేస్ బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయకూడదు. 
 
* అనవసర ప్రయాణాలను మానుకోవాలి 
 
* తరచుగా తాకే వస్తువులను డిస్ ఇన్ఫెక్ట్ చేయాలి. 
 
* బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం, ఉమ్మి వేయడం చేయకూడదు. 
 
* ఇతరుల పట్ల వివక్ష చూపించకూడదు. 
 
* సమూహాలుగా గుమిగూడటం మానుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: