ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలను నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఇప్పటి వరకు ఆరోగ్య శ్రీ సేవల్లో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే.. కేవలం హెచ్చరించి వదిలేసేవారు. ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలంటే.. రాష్ట్ర స్థాయిలో విచారణ జరిగాలి. కేవలం ఉన్నతాధికారులకు మాత్రమే ఆ అధికారం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జిల్లా స్థాయిలోనే ప్రైవేట్ ఆస్పత్రులపై నిఘా పెంచుతున్నారు. ఆరోగ్యశ్రీ విషయంలో అయితే.. నిబంధనలు మరింత కఠినంగా ఉండబోతున్నాయి. సేవలు సరిగాలేని ప్రైవేటు ఆస్పత్రులను జాబితా నుంచి తొలగించడంలో ఏమాత్రం ఆలస్యం చేయబోమని మంత్రి ఆళ్లనాని హెచ్చరించారు.
‘ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకునే ఏ లబ్ధిదారుడైనా ఆస్పత్రిలో చేరినప్పటినుంచి డిశ్చార్జి అయ్యేవరకు అతనికి సేవలందించే విషయంలో పూర్తిబాధ్యత మనదే. ఎక్కడైనా ఫిర్యాదు వచ్చిందంటే ఆ ఫిర్యాదు అక్కడికక్కడే పరిష్కారం కావాలి’ అని వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల నాని చెప్పారు. సచివాలయంలో ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షతో పాటు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారాయన.  

మంత్రి ప్రసంగం ముఖ్యాంశాలు
- ప్రజలకు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో సరైన వైద్యసేవలు అందుతున్నాయా, లేదా అని ప్రతిరోజూ పరిశీలించాలి.
- ఏ ఆస్పత్రుల్లోనైనా నాణ్యత లేకపోతే వాటిని జాబితానుంచి వెంటనే తొలగించాలి.
- గ్రామ సచివాలయాల వద్ద ఆరోగ్యశ్రీ సేవల సమాచారం అందుబాటులో ఉండాలి. జాబితాలోని ఆస్పత్రులపై ప్రత్యేక నివేదిక ఉండాలి.
- ఆరోగ్యమిత్రలను తక్షణమే నియమించాలి. ప్రతి ఆస్పత్రిలో హెల్ప్‌ డెస్క్‌ ఉండాలి. ఐవీఆర్‌ఎస్‌ ను మరింత అభివృద్ధి చేయాలి.
- ఇప్పటివరకు డిశ్చార్జి అయిన తర్వాత అందే ఆరోగ్య ఆసరా పథకం కింద రూ.145 కోట్లు వ్యయం అయింది. 2.50 లక్షల మంది లబ్ధిపొందారు.
- వైకల్యం సర్టిఫికెట్ల కోసం వచ్చేవారికి అదేరోజు ఇవ్వాలి. వారిని ఆస్పత్రుల చుట్టూ తిప్పుకోకూడదు. కరోనా రెండోదశను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.
- వర్షాల నేపథ్యంలో అంటువ్యాధులు, మలేరియా, డెంగీ వంటి దోమకాటు వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: