జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. అన్నిపార్టీలకు చెందిన అగ్రనేతలు రంగంలోకి దిగారు. దీంతో ప్రచారం జోరందుకుంది. మంగళవారం ఆయా పార్టీల అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలతో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారం విషయంలో టీఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీల కంటే కొంచెం ముందుగానే ఉంది. అందులో భాగంగానే మేనిఫెస్టో విడుదల చేయడమే కాకుండా రోడ్ షోలతో దూసుకుపోతుంది.

ఈ క్రమంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోడ్‌షోలతో ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రతీ రోజు వివిధ ప్రాంతాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తూ ప్రజలతో ముచ్చటిస్తున్నారు. ఈ రోజు పలు ప్రాంతాల్లో కేటీఆర్ రోడ్ షోలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు అధికారులు.. కేటీఆర్ షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ రోజు కేటీఆర్ రోడ్ షోలు ఎక్కడెక్కడ నిర్వహిస్తారో వెల్లడించారు. ఈ షెడ్యూల్ ప్రకారం, సాయంత్రం 4గంటలకు ఈసీఐఎల్ చౌరస్తాలో కేటీఆర్ రోడ్ షో ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు శివ హోటల్ జుంక్షన్, మల్లాపూర్ లో ఓ రోడ్ షో.. అనంతరం 6 గంటలకు చిలుకానగర్ జుంక్షన్ వద్ద, 7గంటలకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్‌ సమీపంలో మంత్రి కేటీఆర్ రోడ్‌షోలు జరుగుతాయి.

 గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ నేత బండి సంజయ్ టార్గెట్‌గా కేటీఆర్ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ గెలిస్తే పాత బస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ మాటలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను నిర్వహించిన రోడ్ షోల్లో తప్పుబడుతూ వచ్చారు. మరి ఇవాళ కూడా ఆయన ఇదే స్ట్రాటజీ ఉపయోగిస్తారా? లేక పద్ధతి మారుస్తారా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: