పాకిస్థాన్ కొత్త ఆప్త మిత్ర దేశం టర్కీ.. కశ్మీర్లో తలదూర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతోంది. ఇప్పటికే పలు మార్లు ఈ అంశంపై నోరు జారి భారత్ నుంచి హెచ్చరికలు అందుకొంది. లేటెస్ట్ గా సిరియా నుంచి కిరాయి ఉగ్రమూకను కశ్మీర్లోకి తరలించాలని కుట్రలు పన్నుతోంది. గ్రీకు పత్రికలో దీనిపై వచ్చిన కథనం సంచలనం రేపుతోంది.

దక్షిణాసియాలో పరపతి పెంచుకొని సౌదీ అరేబియాను సవాల్ చేయాలన్నదే టర్కీ వ్యూహం. ఇందుకు కశ్మీర్ ను పావుగా వాడుకోవడానికి టర్కీ ప్రయత్నిస్తోంది. కొన్నాళ్ల క్రితం అజర్ బైజాన్- అర్మేనియా యుద్ధంలో పాల్గొనేందుకు కిరాయి మూకలను పాక్, టర్కీలు ఉసిగొల్పిన విషయం ప్రపంచానికి తెలుసు. కశ్మీర్ లో ఉగ్రవాదులను రాష్ట్రీయ రైఫిల్స్ ఏరివేయడం... బీఎస్ఎఫ్ సరిహద్దులపై పట్టుబిగించడంతో పాక్ మూకలకు దారిలేకుండా పోయింది.

ఈ పరిణామాల మధ్య కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచే పనిని సులేమానీ షా బ్రిగేడ్కు అప్పగించినట్లు గ్రీకు పత్రిక పేర్కొంది. ఈ బ్రిగేడ్ సిరియన్ నేషనల్ ఆర్మీలో పనిచేసిందని గ్రీక్ పత్రిక చెప్తోంది. దీని నాయకుడు అబూ ఎమ్సా ఐదు రోజుల క్రితమే ఆఫ్రిన్లో తన టీమ్ తో సమావేశమై కశ్మీర్లో ఉగ్రవాదాన్ని  పెంచాలనే టర్కీ లక్ష్యాన్ని వెల్లడించినట్టు ఈ కథనం చెప్తోంది. అంతేకాదు.. ఈ  కిరాయి బృందంలో ఒక్కోరికి 2వేల డాలర్లు ఇస్తారని అబు హామీ ఇచ్చాడట.

ఇలాంటి కార్యక్రమాలనే ఎజాజ్, గెరాబ్లుస్, బప్, అఫ్రిన్,ఇడ్లిబ్ ప్రాంతాల్లో నిర్వహించారని గ్రీక్ పత్రిక చెప్తోంది. అయితే ఈ కథనాన్ని ఢిల్లీలోని టర్కీ రాయబారి ఓజ్కాన్ ట్రోన్లర్ ఖండించారు. ఇది ఆధార రహిత కథనం అని ప్రకటించారు.  

కశ్మీర్ సరిహద్దులను పూర్తిగా మూసివేయడం.. సరిహద్దు వాణిజ్యాన్ని ఆపివేయడం.. సెన్సర్లు, కెమెరాలు ఇతర నిఘా సాధనాల వినియోగాన్ని బలగాలు గణనీయంగా పెంచాయి. దీంతో పాక్ నుంచి ఆయుధ సరఫరా కష్టంగా మారిపోయింది. దీంతో ఆయుధ రవాణాకు పాక్ డ్రోన్లను వినియోగించడం మొదలుపెట్టింది. చైనాలో తయారైన పెద్ద డ్రోన్లను వినియోగించడం ప్రారంభించింది. పంజాబ్, జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో వీటి సంచారం గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. కశ్మీర్లో పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో ఆయుధాలను డ్రోన్ల ద్వారా పంజాబ్ ప్రాంతంలో జారవిడిచి.. అక్కడి నుంచి కశ్మీర్కు తరలిస్తున్నారని సమాచారం. మరోవైపు ఉగ్రమూకలు చొరబాట్లకు కూడా కొత్త మార్గాలు వెతుకున్నట్టు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: