పట్టు విడుపులు అస్సలు లేకుండా ఇటు ఎస్ఈసి అటు సర్కార్ నడుమ
స్థానిక సమరం కొనసాగుతోంది. స్టేట్ ఎలక్షన్ కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్
కుమార్ ఉన్నంత వరకూ
స్థానిక ఎన్నికలు జరుపబోమని సర్కార్ మొండికేసుకుని కూర్చుంటే...ఫిబ్రవరిలో ఎన్నికలు ఎలాగైనా జరిపితీరాల్సిందేనని నిమ్మగడ్డ పట్టుపడుతున్నారు.
గత మార్చిలో కరోనా తీవ్రత దృష్ట్యా
స్థానిక ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేసిన దగ్గరనుంచి ఎస్ఈసి కి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య వివాదం మొదలైనది. అది చినికి చినికి గాలివాన చందంగా పంచాయితీ బిల్లు సవరిస్తూ ఆర్డినెన్స్ తేవడం...నిమ్మగడ్డ పదవీకాలం కుదింపు, తమిళనాడు నుంచి మాజీ న్యాయమూర్తిని హుటాహుటిన తీసుకువచ్చి ఎస్ఈసి గా నియమించడం, వీటన్నింటిపై నిమ్మగడ్డ తనకు న్యాయం చేయాల్సిందిగా అర్థిస్తూ హైకోర్టును ఆశ్రయించడం, హై కోర్టు విచారణానంతరం నిమ్మగడ్డను అనుకూలంగా తీర్పు వెల్లడించడం..దీనిపై ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడం, అక్కడ కూడా నిమ్మగడ్డను అనుకూలంగానే తీర్పు రావడం, విధిలేని పరిస్థితుల్లో ఎస్ఈసి గా నిమ్మగడ్డకి పదవిలో కొనసాగేలా ప్రభుత్వం నడచుకోవాల్సి రావడం అందరికీ తెలిసిన కధే.
ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ
స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి లేఖలు రాయడం, ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ చేపట్టే ఏ ప్రక్రియను ముందుకు కదలనీయకుండా కరోనా ఉందంటూ అడ్డుకోవడం కూడా తెలిసిందే.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అవసరమైన చోట్ల ఎన్నికలు జరుగుతుండగా...రాష్ట్రంలో
తిరుపతి ఉప ఎన్నిక కూడా ముంచుకొస్తుండగా,
స్థానిక ఎన్నికలు మాత్రం జరగనీయకుండా ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో..తాజాగా
జనవరి నుంచి కోవిడ్ వాక్సిన్ వేసేందుకు యంత్రాంగం మొత్తం భాగస్వామ్యం కావాల్సి ఉందని, ఈ కార్యక్రమానికి రెండు మూడు నెలలు పడుతుందని చెబుతూ ఇప్పట్లో పంచాయితీ ఎన్నికలు జరుపలేమంటూ
ఏపీ సర్కార్ హై కోర్ట్ లో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఎస్ఈసి ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 18 కి వాయిదా వేసింది.