కొవిడ్ టీకాతో అందరికీ మేలు జరగొచ్చు కానీ, కొంతమందికి మాత్రం అవి రియాక్షన్ ఇచ్చే అవకాశముందని సమాచారం. అందుకే తొలి దశలో చిన్న పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వట్లేదు. గర్భిణులను కూడా దూరం పెడుతున్నారు. వివిధ రకాల అలెర్జీలు ఉన్నవారిని, తీవ్ర ఆరోగ్య సమస్యలున్నవారిని కూడా తొలి దశ లిస్ట్ లో చేరనీయలేదు. ఇలా జాగ్రత్తగా లిస్ట్ తయారు చేసి ఇస్తున్నా కూడా కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ భయం కలిగిస్తున్నాయి. తాజాగా మెక్సికోలో జరిగిన ఉదంతంతో మరోసారి ప్రపంచం ఉలిక్కిపడింది.
కొవిడ్ నిరోధానికి ఫైజర్-బయో ఎన్ టెక్ సంస్థ అభివృద్ధి చేసిన టీకాను తీసుకున్న ఓ మెక్సికో వైద్యుడిలో దుష్ప్రభావాలు తలెత్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మ సంబంధిత అలర్జీ వంటి లక్షణాలు గుర్తించడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్చినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ప్రాథమిక పరీక్షల్లో దీన్ని ఎన్సెఫలోమైలిటిస్ గా గుర్తించారు. మెదడు, వెన్నెముకలో తలెత్తే ఇన్ ఫ్లమేషన్ వల్ల ఎన్సెఫలోమైలిటిస్ వస్తుందని అంటున్నారు. ప్రయోగాల దశలో ఫైజర్ టీకా తీసుకున్న వాలంటీర్లలో ఇలాంటి దుష్ప్రభావం తలెత్తలేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఆ వైద్యుడికి గతంలో పలు సార్లు అలర్జీలు తలెత్తిన దాఖలాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై ఫైజర్‌గానీ, బయో ఎన్ టెక్ సంస్థ గానీ స్పందించలేదు. ఇప్పటి వరకు మెక్సికోలో 1,26,500 మంది కొవిడ్ బారిన పడి మరణించారు. డిసెంబరు 24 నుంచి అక్కడ టీకా పంపిణీ మొదలైంది.
అలర్జీలు ఉన్నవారిలో టీకాతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్న అనుమానం మరోసారి మెక్సికో వైద్యుడి ఉదంతంతో రుజువైంది. అందుకే భారత్ లో కూడా టీకా పంపిణీ తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అబ్జర్వేషన్ రూమ్ ని ఏర్పాటు చేసి, టీకా తీసుకున్న వారిని అక్కడ ఓ అరగంటసేపు ఉంచి ఆ తర్వాతే ఇంటికి పంపిస్తారు. డ్రైరన్ లో భాగంగా ఈ విషయంలో సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి