లవ్ స్టోరీ సినిమాకి సంబంధించి సారంగదరియా పాట ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. అయితే ఆ పాట అంతకంటే ఎక్కువగా వివాదాలతో పాపులర్ అవుతోంది. ఆ పాటను తాను వెలుగులోకి తెచ్చానంటూ కోమలి అనే గాయని మీడియాకెక్కడంతో అసలు వివాదం మొదలైంది. రచయిత సుద్దాల అశోక్ తేజ ఆ వివాదానికి ముగింపు పలకాలని చూసినా సాధ్యం కాలేదు. ముందు పాట పాడాలంటూ కోమలినే సంప్రదించామని, ఆమె కుదరదని చెప్పిన తర్వాత మంగ్లితో పాడించామని అని చెప్పారు. కానీకోమలి పాటలో తనకు కూడా క్రెడిట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రచయిత పేరు దగ్గర సుద్దాల అశోక్ తేజతోపాటు తన పేరు కూడా వేయాలంటున్నారు.

తాజాగా ఈ వివాదంపై స్పందించిన దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ఆ పాటని మొదటగా కోమలితో పాడించాలని అనుకున్నామని కుదరకపోవడంతో మంగ్లికి అవకాశమిచ్చామని చెప్పారు. అంటే పరోక్షంగా మంగ్లి ఆ పాటకు సెకండ్ ఆప్షన్ అని చెప్పేశారు.

వాస్తవానికి మంగ్లి గొంతు సారంగదరియా పాటను ఓ రేంజ్ కి తీసుకెళ్లింది. కోమలి పాడితే ఎలా ఉంటుందో చెప్పలేం కానీ.. ఇప్పటికే పాపులర్ అయిన మంగ్లి తన వాయిస్ తో పాటకు ప్రాణం పోసిందని చెప్పాలి. అదే సమయంలో ఆమెను సెకండ్ ఆప్షన్ గా దర్శకుడు, రచయిత పేర్కొనడం మరో వివాదానికి దారి తీస్తోంది. అయితే కోమలి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే క్రమంలో దర్శకుడు ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వాల్సి వచ్చింది.

గతంలో ‘రేలా రే రేలా’ ప్రోగ్రాంలో  శిరీష అనే అమ్మాయి ఆ పాట పాడిందని, అప్పటినుంచి అలాంటి పాటను తన సినిమాల్లో పెట్టాలని అనుకున్నానని దర్శకుడు శేఖర్ కమ్ముల చెబుతున్నారు. అయితే సారంగదరియా పాటను తొలుత వెలుగులోకి తెచ్చిన కోమలితో పాడిద్దామని రచయిత సుద్దాల అశోక్ తేజ తనతో చెప్పారని, వరంగల్ నుంచి కోమలిని పాట పాడేందుకు రమ్మని అడగగా ఆరోగ్యం సరిగా లేదని చెప్పారని అన్నారు. అప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ చెన్నైనుంచి రావడంతో మంగ్లితో పాట పూర్తి చేశామని వివరణ ఇచ్చారు. వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా.. సారంగదరియా పాట క్రెడిట్ తప్పకుండా కోమలికి కూడా ఇస్తామని, తామిస్తామన్న డబ్బులు ఇవ్వడమే కాకుండా.. ఆడియో వేడుకలో ఆమెతోటే పాట పాడిస్తామని మాటిచ్చారు శేఖర్ కమ్ముల. 

మరింత సమాచారం తెలుసుకోండి: