కరోనా చికిత్స కోసం హైదరాబాద్‌కు రోగులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి రోగులు హైదరాబాద్‌కు వస్తున్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్‌లోని ప్రధాన ప్రైవేటు ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో ఫుల్లుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు కొత్తగా కరోనా చికిత్స కోసం హైదరాబాద్ రావాలంటే పొరుగు రాష్ట్రాల వారు ఈ నిబంధనలు పాటించాలంటూ కొత్త రూల్స్ పెట్టింది.

ఇతర రాష్ట్రాల నుంచి కరోనా అడ్మిషన్ల కోసం హైదరాబాద్ కు వస్తున్న వాళ్ళ కోసం విధివిధానాలు జారీ చేసింది తెలంగాణ సర్కారు. కొందరు ఏ ఆస్పత్రిలో అడ్మిట్ కాకుండా, అంబులెన్సుల్లో పేషేంట్లను పెట్టుకుని తిరుగుతున్నట్లు తెలంగాణ సర్కారు గుర్తించింది. అందుకే.. కోవిడ్ పేషేంట్ల ఆడ్మిషన్ కోసం ముందే ఆస్పత్రి అనుమతి అవసరమని నిబంధన విధించింది.

అంతే కాదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కారు. ఇకపై పొరుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కరోనా చికిత్స కోసం రావాలంటే.. 0402465119, 9494438351 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. ఆస్పత్రి నుంచి అడ్మిషన్ ప్రపోజల్ లెటర్ ఉంటేనే పేషేంట్ ను తీసుకు వచ్చేందుకు తెలంగాణ కంట్రోల్ రూమ్ అనుమతి ఇస్తుంది.

అయితే.. ఇప్పటికే ఇలా కరోనా చికిత్స కోసం వచ్చే వారిపై ఆంక్షలు విధించడం విమర్శలకు దారి తీసింది. కొన్ని రోజుల క్రితం ఆంధ్రా నుంచి వస్తున్న అంబులెన్సులను సరిహద్దుల్లోనే ఆపడం వివాదాస్పదం అయ్యింది. భర్తను అంబులెన్సులో తీసుకొస్తున్న ఓ మహిళను చెక్ పోస్టు దగ్గర ఆపితే.. ఆమె సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌ లకు మొరపెట్టుకుంటూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయ్యింది. బహుశా అలాంటి విమర్శలను కట్టడి చేసేందుకే ఈ కొత్త రూల్స్ పెట్టారని భావిస్తున్నారు. కానీ.. కరోనా పేషెంట్ ఆరోగ్యం విషమిస్తేనే హైదరాబాద్ తీసుకొస్తుంటారు. అలాంటి సమయంలో ఇలాంటి రూల్స్ పాటించడం సాధ్యమయ్యే పనేనా అన్నది ఆలోచించాల్సిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: