కరోనా.. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి ఇది.. ఆ దేశం ఈ దేశం అని కాకుండా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మాయావి. 2019 చివర్లో చైనాలో వెలుగు చూసిన ఈ రాకాసి.. ఆ తర్వాత కాలంలో క్రమంగా ఒక్కో దేశానికి పాకుతూ మరణ మృదంగం మోగించింది. ఇప్పుడు కరోనా అడుగు పెట్టని దేశాలు లేకపోవచ్చు. కరోనా మరణాలు కనిపించని దేశం లేని పరిస్థితి. ఒక్కసారితో సరిపెట్టకుండా.. రెండో దశ కూడా ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది.



ఇక్కడితో ఆగేది లేదని మూడోవేవ్‌ కూడా రెడీ అవుతోంది. అయితే.. ఇప్పటి వరకూ అసలు ప్రపంచంలో కరోనాతో ఎందరు చనిపోయారు.. అనే లెక్కలు మాత్రం తేలడం లేదు. అనేక దేశాలు కరోనా మరణాల విషయంలో తప్పుడు లెక్కలు చెబుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కరోనా మరణాలుపై ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ ఓ సర్వే చేసింది.



ఈ రాయిటర్స్ సర్వే ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల 40 లక్షల మంది వరకూ చనిపోయారట. అయితే ఈ మరణాల సంఖ్య క్రమంగా మొదట్లో పెరుగుతూ వచ్చిందట. తొలి 20 లక్షల మరణాల నమోదుకు ఏడాది కాలం పట్టిందట. కానీ.. ఆ తర్వాత మరో 20 లక్షలు చేరుకునేందుకు కేవలం 166 రోజుల సమయం మాత్రమే పట్టిందని రాయిటర్స్ సంస్థ చెబుతోంది. అంతే కాదు.. అమెరికా, బ్రెజిల్‌, భారత్‌, రష్యా, మెక్సికో వంటి కొన్ని దేశాల్లోనే ప్రపంచంలోని 50శాతం కరోనా సంబంధిత మరణాలు నమోదయ్యాయట.



ఇక భారత్ మరీ సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే.. భారత్‌, బ్రెజిల్‌ దేశాల్లోనే ప్రతి రోజు గరిష్ట మరణాలు నమోదవుతున్నట్లు రాయిటర్స్‌ చెబుతోంది. అంతే కాదు.. కరోనాతో చనిపోయిన ముగ్గురిలో ఒకరు భారత్‌ నుంచే ఉన్నారట. అంటే మన దేశంలో కరోనా ఏ రేంజ్‌లో విజృంభించిందో చెప్పకనే చెప్పింది రాయిటర్స్ వార్తాసంస్థ. ఇదీ కరోనా ప్రపంచంపై చూపిన విలయ విషాదం.



మరింత సమాచారం తెలుసుకోండి: