పోలీస్ కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్వేరో వ్యవస్థాపకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  స్పష్టం చేశారు. బహుజన రాజ్యాధికార సాధన కోసం మరణించడానికి అయినా సిద్ధంగా ఉన్నానన్నారు. పదవీ విరమణ చేసిన  మరుసటి రోజే పోలీసులు తనపై కేసులు పెట్టారని అన్నారు. సంగారెడ్డిలో జరిగిన స్వేరోస్ కార్యకర్తలతో ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ బాటలో నడిచేందుకు ఒంటరి పోరాటం చేసేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.

ఒక్క ప్రవీణ్ కుమార్ పై కేసులు పెడితే కోట్లాది మంది ప్రవీణ్ కుమారులు పుట్టుకొస్తున్నారని అన్నారు. పోలీస్ ఉద్యోగం ఎందుకు వదులుకున్నవని తన తల్లి అడిగితే  కోట్లాది మంది దళిత బిడ్డలకు బాగు చేసేందుకే రాజీనామా చేశానని ఆయన చెప్పారు. బాబా సాహెబ్ అంబేద్కర్ గురించి నాలుగేళ్ల చిన్న పిల్ల ఎంతో చక్కగా మాట్లాడిందని, కనీసం  నాలుగేళ్ల చిన్నారి ఉన్నంత  జ్ఞానం, ధైర్యం  తెలంగాణలోని 29 మంది దళిత ఎమ్మెల్యేలకు లేదని, ఎమ్మెల్యేలకు ధైర్యముంటే  ఎప్పుడో తెలంగాణ రాష్ట్రం బాగుపడేది అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో  దళిత బంధు పథకాన్ని 1000 కోట్ల రూపాయలతో అమలు చేయాలని అనుకుంటున్నారని, అవే డబ్బులతో దళిత బిడ్డలను ఆస్ట్రేలియా, అమెరికా లాంటి విదేశాలకు పంపి ఉన్నత చదువులు చదివిస్తే సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, బిల్ గేట్స్ లాంటి మేధావులు అవుతారని పేర్కొన్నారు.

 దళిత బిడ్డలు ఎప్పుడు రోడ్లు ఊడ్వలని, ఎన్ని రోజులు కల్లు గియ్యాలని, గొర్లు బర్లు కాయలని ప్రవీణ్  కుమార్ ప్రశ్నించారు. అమెరికా ఆస్ట్రేలియా వెళ్లి  ఎందుకు చదువుకో కూడదని  దళిత బిడ్డలు ఆలోచించాలని కోరారు. వందల యేండ్లుగా దళితుల అణచివేత గురవుతున్నారని, వారిపై కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని  తెలిపారు. మటన్, చికెన్ బిర్యానీలు దావతులకు, మోసపోయే జాతులు మనవి కావని, రాజ్యాధికారం సాధించేందుకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. మా రాజ్యం వస్తుందని అలంపూర్ నుంచి  అదిలాబాద్ వరకు, తాండూరు నుంచి నల్లగొండ వరకు ప్రచారం చేయాలని  విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: