ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల ప్రాబల్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. అమెరికా, నాటో దళాల ఉపసంహరణ తర్వాత కీలక ప్రాంతాలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్నారు. కుందుజ్ రాష్ట్రంలోని కీలక సైనిక స్థావరం సహా మూడు రాష్ట్రాలను వశపరుచుకున్నారు. దీంతో ఆ దేశ ఈశాన్య ప్రాంతమంతా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. దీంతో తాలిబన్ల నుంచి రాజధాని కాబూల్ ను ప్రభుత్వం ఎంతకాలం కాపాడగలదు అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల ఆక్రమణలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడున్న భారతీయులకు భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆప్ఘనిస్థాన్ కు కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులు నిలిపివేసే లోపు అక్కడి నుంచి భారతీయులు వెంటనే స్వస్థలాలకు వచ్చేయాలంది. గత మంగళవారం తాలిబన్లు మజర్ ఐ షరిఫ్ నగరంపై దాడి చేయగా.. ఆ నగర సమీపంలోని భారతీయులను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

మరోవైపు జమ్ముూ కాశ్మీర్ లోకి చొరబడేందుకు పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నట్టు భద్రతా బలగాలు స్పష్టం చేశాయి. సరిహద్దులకు సమీపంలో సుమారు 250నుంచి 300మంది ఉగ్రవాదులు ఉన్నట్టు తెలిపాయి. ఈ మధ్య సరిహద్దుల్లో టెర్రరిస్టులు డ్రోన్ల సాయంతో బాంబు దాడులకు పాల్పడుతున్నారు. అందుకే భద్రతా దళాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయని జమ్మూకాశ్మీర్ డైరెక్టర్ జనరల్ దిల్ బాగ్ సింగ్ వెల్లడించారు.

మొత్తానికి ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సైనికులకు.. తాలిబన్లకు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇద్దరి మధ్య జరుగుతున్న తూటాల వర్షంలో అమాయకులు ప్రాణాలు వదులుతున్నారు. సైనికులూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. అటు తాలిబన్లను అంతే స్థాయిలో మట్టుబెడుతోంది ఆఫ్ఘాన్ సైన్యం. అక్కడ మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు పాక్ సరిహద్దుల నుంచి ప్రమాదం పొంచి ఉండటంతో మన సైనికులు అప్రమత్తమయ్యారు. కంటిమీద కునుకులేకుండా ఆ దేశ క్రూరమృగాల నుండి దేశాన్ని కాపాడుతున్నారు.









మరింత సమాచారం తెలుసుకోండి: