ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే ఏటా అనేక అంశాలపై సర్వేలు చేయిస్తుంది.. అందులో రాజకీయ నేతలపై చేసే సర్వేలపై దేశమంతటా ఆసక్తి ఉంటుంది. ఇండియా టుడే గ్రూపుకు మంచి క్రెడిబిలిటీ ఉండటంతో ఈ సర్వేల్లో ఏ నాయకుడు నెంబర్ వన్‌గా వస్తాడా అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో ఉంటుంది. ఈ సంస్థ నిర్వహించిన పలు సర్వేల్లో గతంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు టాప్‌లో వచ్చారు. అప్పుడు ఇవే పార్టీలు తమ నాయకుడు సూపర్.. కావాలంటే ఇండియా టుడే సర్వే చూడండని గొప్పలు చెప్పుకున్నారు కూడా.


ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా ఇండియా టుడే మోస్ట్‌ పాపులర్ సీఎం అంటూ ఓ లిస్టు విడుదల చేసింది. ఏ రాష్ట్రం వాళ్లను ఆ రాష్ట్ర సీఎం గురించి ప్రశ్నించారు. ఎక్కువ మంది ప్రజలు మెచ్చుకున్న సీఎంను వారు పొందిన ఓట్ల శాతాన్ని బట్టి ర్యాంకులు ఇచ్చారు. ఈసారి తమిళనాడు సీఎం స్టాలిన్‌ అందరికన్నా ఎక్కువ ప్రజాదరణతో టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. ఈ ఏడాదే సీఎం అయిన స్టాలిన్.. తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు అందుకున్నారని చెప్పాలి. 48 శాతం ప్రజాదరణతో ఆయన నెంబర్‌ వన్ స్థానం దక్కించుకున్నారు. ఆయన తర్వాత 38 శాతం ప్రజాదరణతో ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్ రెండో స్థానంలో నిలిచారు.  


ఇటీవలే కేరళకు రెండోసారి సీఎంగా ఎన్నికైన కమ్యూనిస్టు దిగ్గజం పినరయి విజయన్... 35 శాతం ప్రజాదరణతో మూడో స్థానంలో నిలవగా.. ఉద్దవ్‌ ఠాక్రే, మమతా బెనర్జీ నాలుగు, ఐదు స్థానాలు దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆరో స్థానంలో అసోం సీఎం హిమాంత బిశ్వశర్మ, ఏడో స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎనిమిదో స్థానంలో  రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌, తొమ్మిదో స్థానంలో అరవింద్‌ కేజ్రీవాల్‌, పదో స్థానంలో హేమంత్‌ సొరేన్‌ నిలిచారు.


విచిత్రం ఏంటంటే.. గతంలో చెరోసారి నెంబర్ వన్ స్థానం దక్కించుకున్న కేసీఆర్, జగన్‌ ల ఊసే ఈసారి ఈ సర్వేలో కనిపించలేదు. కనీసం టాప్ టెన్‌లో కూడా ఈ ఇద్దరిలో ఏ ఒక్కరూ స్థానం సంపాదించుకోలేదు. ఈ సర్వే ఫలితాలు చూసి షాక్‌ తిన్న టీఆర్‌ఎస్‌, వైసీపీ నాయకులు.. అబ్బే ఇలాంటి సర్వేలను పెద్దగా పట్టించుకోనక్కర్లేదని  సర్ది చెప్పుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: