తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ట్రబుల్ షూటర్ వచ్చేసారు. సమస్య పెద్దది అవుతుంటే చాలు కూల్ గా, సైలెంట్ గా పని  చేస్తారు. తాజాగా టీ కాంగ్రెస్ లో చెలరేగిన దుమారాన్ని కూడా ఆ పెద్దమనిషే తెర వెనుక క్లియర్ చేశారట.ఇంతకీ ఎవరా ట్రబుల్ షూటర్?ఏం చేశాడతను? తెలంగాణ కాంగ్రెస్ లో కురువృద్ధుడు,తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై భీష్మపితామహుడు, పెద్దరికంతో మెప్పించడం తన స్టైల్. ఆయనే కుందూరు జానారెడ్డి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పరాజయం సమయంలో ఏ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని  ప్రకటించిన జానారెడ్డి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ పాత్ర పోషిస్తున్నాడు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య అంతర్గత సమస్య వచ్చిందంటే చాలు కూల్ గా  చేసి తనదైన శైలిలో పరిష్కారం చేస్తున్నాడు.

ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పూర్తిగా అండదండలు అందిస్తూ వెన్నంటే నిలుస్తున్నారు జానారెడ్డి. జానారెడ్డి వాస్తవానికి  రాజకీయాలకు విరామం ప్రకటించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో  ఓటమి తరువాత స్వయంగా గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం పరిశీలన చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు. తప్పనిసరి అవసరమైతే తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లో జోక్యం చేసుకోనని చెప్పారు. కానీ జానారెడ్డి అందుకు భిన్నంగా కాంగ్రెస్ స్టేట్ పాలిటిక్స్ లో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. పిసిసి పీఠం రేవంత్ కు దక్కడంలో జానారెడ్డి కీలకపాత్ర  పోషించారని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. పీసీసీ గా రేవంత్ పేరు అధిష్టానం ప్రకటించిన తర్వాత మొట్టమొదటిగా వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసింది కూడా జానారెడ్డినే. ఆ తర్వాత రేవంత్ తన దూకుడుతో  పార్టీలో సమస్యలు తలెత్తినా ప్రతిసారి జానా రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. స్వయంగా గజ్వేల్ దళిత, దండోరా సభ సన్నాహక సమావేశానికి కూడా జానారెడ్డి హాజరయ్యారు. తాజాగా రేవంత్,జగ్గారెడ్డి మధ్య విభేదాలు తలెత్తడంతో సీనియర్ నేతలతో రేవంత్ కు గ్యాప్ కొనసాగుతోంది. ఈనేపథ్యంలో గాంధీభవన్లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీలో రేవంత్ తీరును ఎండగట్టాలని సీనియర్లు భావించారట. ఇంతలో మళ్లీ జానారెడ్డి  ఈ భేటీకి హాజరయ్యారు.

పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో రేవంత్ తీరు పై కొందరు నేతలు తప్పుబట్టారట. సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలను ఎండగట్టారట. మాజీ పిసిసి చీఫ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త పిసిసి తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావించారట. ఇంతలో జానారెడ్డి జోక్యం చేసుకొని సర్లే పోనీ రేవంత్ కొత్తగా వచ్చాడని ఆయనకు తెలియక కొన్ని తప్పులు జరుగుతుంటాయి. మీరు ఏడేళ్లు పిసిసి గా పని చేశారు కదా. సలహాలు, సూచనలు ఇవ్వండి అంటూ జానారెడ్డి మాట్లాడేసరికి మిగతా వారు సైలెంట్ అయ్యారట. సుదీర్ఘంగా ఆరు గంటల పాటు సాగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ  లో సందర్భం వచ్చినప్పుడల్లా సీనియర్లు రేవంత్ ను టార్గెట్ చేసే ప్రయత్నం చేసిన జానారెడ్డి ఒక సైడ్ నుంచి, మరోవైపు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ వెనకేసుకొస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: