జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చింది. పవన్ కల్యాణ్ దూకుడు పెంచారనే విషయాన్ని స్పష్టంగా తెలిసేలా చేసింది. అదే సమయంలో పవన్ భవిష్యత్ రాజకీయాలపై కూడా స్పష్టత వచ్చేసింది. రాష్ట్ర అభివృద్ధి ప్రాతిపదిక ఆధారంగానే తాను పొత్తులు పెట్టుకుంటున్నాని చెప్పిన పవన్ కల్యాణ్ 2024నాటికి సోల్ పర్ఫామెన్స్ ఇస్తారనే విషయాన్ని చూచాయగా చెప్పేశారు.

జనసేన అధికారంలోకి వస్తుంది, జనసేన మాత్రమే అధికారంలోకి వస్తుంది..
2024లో వైసీపీకి 151 సీట్లు పోయి 15 సీట్లు మాత్రమే వస్తాయని, జనసేన అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు పవన్ కల్యాణ్. అదే సమయంలో పొత్తు ధర్మాన్ని పవన్ పట్టించుకోలేదు. కనీసం బీజేపీ పేరు ఆయన ప్రస్తావించలేదు. జనసేన అధికారంలోకి వస్తుందని యథాలాపంగా అన్నారని అనుకోలేం. కచ్చితంగా జనసేన పేరు మాత్రమే చెప్పాలనుకున్నారు, చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో ఎక్కడా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, బీజేపీని కానీ పొగిడే ప్రయత్నం చేయలేదు పవన్ కల్యాణ్. అసలు బీజేపీ ప్రస్తావనే లేకుండా జనసేన విస్తృత స్థాయి సమావేశం ముగిసింది.

బీజేపీతో జనసేన పొత్తుపై చాలా కాలంగా అనుమానాలు నెలకొన్నాయి. అసలు బీజేపీతో కలవడం వల్ల జనసేనకు కలిగిన ప్రయోజనం ఏంటనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. తిరుపతి ఎన్నికల వరకు జనసేన త్యాగాలకే పరిమితం అయింది. చివరకు పరిషత్ ఎన్నికల్లో కూడా జనసేనకు చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు వచ్చాయి కానీ, జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ మాత్రం నిరాశ పరిచింది. ఇటీవల పరిషత్ ఎన్నికలపై రివ్యూ జరిపిన జనసేనాని.. బీజేపీకి ఇచ్చిన సీట్ల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో జనసేన మరిన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేసి ఉంటే, ఎక్కువ స్థానాలు గెలిచేవారమని కూడా అన్నారు. దాదాపుగా బీజేపీతో జనసేనకు ఉపయోగం ఉందా లేదా అనే విషయంపై పవన్ ఓ క్లారిటీకి వచ్చేశారని తెలుస్తోంది. ఈ క్లారిటీతోనే ఆయన 2024 ఎన్నికలను ఎదుర్కోడానికి సిద్ధమయ్యారు. అయితే విమర్శలు, ప్రతి విమర్శలు లేకుండా స్మూత్ గా బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలనుకుంటోంది జనసేన.

మరింత సమాచారం తెలుసుకోండి: