ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ కార్యాలయాలపై దాడులు జరగడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ఇప్పటికే అధికార పార్టీపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. రేపో మాపో.. చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కూడా కలుస్తారని అంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను ఆయనకు వివరిస్తారని తెలుస్తోంది. అధికార పార్టీ తీరుకు నిరసనగా చంద్రబాబు నిరవధిక దీక్ష కూడా చేపట్టారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రికి లేఖలు కూడా రాశారు బాబు.

అసలు ఏపీలో రాష్ట్రపతిపాలన ఎందుకు విధిస్తారు..? రాష్ట్రపతి పాలన అవసరం అసలు ఏమొచ్చింది..? ఆ మధ్య రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటిస్తారనే ప్రచారం జోరుగాసాగింది. మనదేశంలో రాజ్యాంగంలోని 356 ఆర్టికల్ ప్రకారం కేంద్రానికి రాష్ట్రపతి పాలన విధించే అధికారం ఉంటుంది. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం అదుపు చేయాలేని సమక్షంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు. రాష్ట్ర రాజకీయ యంత్రాంగం ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమైందని కేంద్రంభావిస్తే రాష్ట్రపతి పాలన విధించవచ్చు. రాష్ట్రంలోని పరిస్థితులపై గవర్నర్ ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్రపతి పాలన విధిస్తుంటారు. రాష్ట్రపతి ప్రతినిధిగా గవర్నర్ వ్యవహరిస్తూ పరిపాలన చేస్తారు.

రాష్ట్రపతి పాలనలో మొదటగా ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు. ముఖ్యమంత్రి, మంత్రి మండలిని కూడా రద్దు చేస్తారు. ఆ తర్వాత గవర్నర్ పాలనా వ్యవహారాలను చూసుకుంటారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. చంద్రబాబు లేఖ రాసినంత మాత్రాన రాష్ట్రపతి పాలన విధిస్తారని అనుకోలేం. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పిన ఉదాహరణలు లేవు. ఒకటి రెండు చోట్ల పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగితే.. దానిని రాష్ట్రం మొత్తానికి ఆపాదించలేం. అదే సమయంలో కేంద్ర బలగాలు రాష్ట్రానికి వచ్చే అవకాశం కూడా లేదనే చెప్పాలి. అయితే చంద్రబాబు మాత్రం రాష్ట్రపతి పాలన అంటూ హడావిడి మొదలు పెట్టారు. కేంద్ర  బలగాలను దింపి ఏపీలో శాంతి భద్రతలు కాపాడాలని కోరుతున్నారు. బాబు లేఖలపై కేంద్రం నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో చూడాలి. ప్రస్తుతానికి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కానీ, అవసరం కానీ లేదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: